మటన్ ముక్క కోసం కొట్లాట.... ఎక్కడ?

మంగళవారం, 26 ఫిబ్రవరి 2019 (13:32 IST)
మటన్ ముక్క కోసం రెండు వర్గాలవారు కొట్లాడుకున్నారు. పెళ్లి భోజనంలో మటన్ ముక్క వడ్డించలేదన్న కారణంతో వరుడు, వధువు తరపు బంధువులు ఘర్షణపడ్డారు. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాకలో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఉప్పుసాక గ్రామానికి చెందిన ఆజ్మీరా కుమారి వివాహం కొత్తగూడేనికి చెందిన లావుడ్యా ప్రవీణ్‌ అనే యువకుడితో గత శుక్రవారం జరిగింది. ఈ పెళ్లి కూడా వధువు ఇంటివద్దే జరిగింది. వివాహం తర్వాత వధువు తరపువారు విందు భోజనం ఏర్పాటు చేశారు. ఈ విందులో మటన్ స్థానంలో చికెన్ వడ్డించారు. 
 
అయితే భోజనంలో మటన్ కూర వడ్డించాలని వరుడు తరపు వారు పట్టుబట్టారు. దీంతో వధువు, వరుడు తరపువారికి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. మటన్‌ పెట్టే ఆర్థిక స్థోమత లేదని చికెన్‌తో సరిపెట్టుకోవాలని వధువు తరపువారు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. దీనికి వరుడు తరపు బంధువుల ససేమిరా అన్నారు. 
 
దీంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. చివరకు ఇరువర్గాల మధ్య మాటమాట పెరిగి ఘర్షణ తలెత్తింది. భోజనాలు చేసేందుకు వేసిన కుర్చీలు తీసుకుని ఒకరిపై ఒకరు భౌతికదాడులకు దిగారు. సుమారు వందకుపైగా కుర్చీలు విరిగిపోగా.. 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం ఇరువర్గాల వారు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదులు చేసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు