తెలంగాణ యువతకు గుడ్ న్యూస్... ఏంటదో తెలుసా?

శుక్రవారం, 23 అక్టోబరు 2020 (14:22 IST)
తెలంగాణ యువతకు గుడ్ న్యూస్. తెలంగాణలో పోలీసు ఉద్యోగాల కోసం వేచి చూస్తున్న యువతకు రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్ అలీ శుభవార్త చెప్పారు. త్వరలోనే తెలంగాణలో 20 వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని వెల్లడించారు. కరోనా సమయంలోనే గాక ఇటీవల హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే.. పోలీసులు వారికి సాయం చేయడంలో ఎంతో కృషి చేశారని వారి సేవలను కొనియాడారు. 
 
ఈ నేపథ్యంలో మునుపెన్నడూ లేని విధంగా.. తెలంగాణ పోలీస్ అకాడమీ ద్వారా ఇప్పటికే 1,25,848 మందికి శిక్షణ ఇచ్చామనీ, అంతేగాక తమ ప్రభుత్వ హయాంలో 18,428 ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేశామని అలీ తెలిపారు. ఇదేవిధంగా కొత్తగా చేపట్టబోయే పోలీసు నియామకాల గురించి కూడా త్వరలోనే వివరాలు వెల్లడిస్తామన్నారు. 
 
పోలీస్ అకాడమీలో శిక్షణ పొందిన 1162 మంది ఎస్సైల 'పాసింగ్ అవుట్ పరేడ్' కార్యక్రమం సందర్భంగా హోంమంత్రి, డీజీపీ మహేందర్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అలీ మాట్లాడుతూ.. రోజు రోజుకూ వస్తున్న మార్పులకు అనుగుణంగా పరిస్థితులను అర్థం చేసుకొని సమయోచితంగా, రాజ్యాంగ బద్దంగా పోలీస్ అధికారులు విధులను నిర్వర్తించాలని తెలిపారు. 
 
తెలంగాణలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని అలీ చెప్పారు. పోలీసు శాఖకు నిధుల కొరత లేదనీ, ఆధునిక పరికరాల కొనుగోలు, సాంకేతికతను ప్రాదాన్యతనిస్తూ.. సమస్యలను పరిష్కరిస్తున్నామని తెలిపారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు