పీవీ ప్రధాని అయ్యే సమయానికి దేశం అంధకారంలో ఉంది: కేసీఆర్

ఆదివారం, 28 జూన్ 2020 (12:57 IST)
పీవీ నరసింహారావు ప్రధాని అయ్యే సమయానికి దేశం అంధకారంలో ఉందని, మన దేశంలోని బంగారాన్ని ఇతర దేశాల్లో పెట్టుకుంటోన్న సమయంలో, ఆర్థికంగా దేశ పరిస్థితి క్లిష్టంగా ఉన్న సమయంలో ప్రధాని పదవిని చేపట్టారని సీఎం కేసీఆర్ అన్నారు.

పీవీ శత జయంతి ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్‌లోని నక్లెస్‌ రోడ్డులో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. "ఎంతో గొప్పగా దేశాన్ని ముందుకు నడిపించారు. అప్పటివరకు రాజకీయాల్లో లేని వ్యక్తిని మన్మోహన్ సింగ్‌ ను ఆర్థిక శాఖ మంత్రిని చేశారు. ఆయన ద్వారా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు.

దేశం ఆర్థిక దుస్థితి నుంచి గట్టెక్కింది. విద్యా శాఖ పేరును కూడా హెచ్‌ఆర్‌డీగా మార్చింది ఆయనే. ఆయనే గురుకుల పాఠశాలలను ప్రారంభించారు. జైళ్ల శాఖలోనూ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. సహాయకులు ఉన్నప్పటికీ ఆయనే స్వయంగా తన కంప్యూటర్‌ను ఆపరేట్‌ చేసుకునేవారు.

ప్రైవేటు రంగంతో ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ పడే స్థాయికి ఆయన అన్ని రంగాల్లోనూ సంస్కరణలు చేశారు. ఆయన వ్యక్తిత్వ పటిమను అభివర్ణించేందుకు మాటలు చాలవు. ఆయన గొప్ప సంస్కరణ శీలి.. సంస్కరణాభిలాషి. ఏ రంగంలో అడుగుపెట్టినా ఆ రంగంలో సంస్కరణలు తీసుకొచ్చారు. ఆయన నిరంతర విద్యార్థి, సామాజిక దృక్పథం గల వ్యక్తి" అని కేసీఆర్ చెప్పారు.

పీవీ ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన నాయకుడని, ఆయన జీవితమంతా సంస్కరణలతోనే సాగిందని వ్యాఖ్యానించారు. ఏ హోదాలో పనిచేసినా తాను చేయగలిగినంత గొప్ప పనులు చేసేవారని, తాను నమ్మింది.. అనుకున్నది గొప్పగా చేసిన వ్యక్తి ఆయన అని కేసీఆర్ శ్లాఘించారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు