మిర్చి వ్యాపారికి టోకరా! .రూ.70 లక్షలతో ఉడాయించిన ట్రక్ డ్రైవర్లు

మంగళవారం, 28 ఏప్రియల్ 2020 (18:20 IST)
తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లాలో గుంటూరు మిర్చి వ్యాపారికి ట్రక్ డ్రైవర్లు షాకిచ్చారు. మిర్చి పంట అమ్మగా వచ్చిన రూ.70లక్షల నగదుతో డ్రైవర్ పరారయ్యాడు. దీంతో షాక్‌కు గురైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

గుంటూరు జిల్లాకు చెందిన ఏడుకొండలు మిర్చి వ్యాపారం చేస్తుంటాడు. ఇటీవల రెండు ట్రక్కుల్లో మిర్చి లోడును మహారాష్ట్రలోని షోలాపూర్‌‌కు తీసుకెళ్లి అమ్మాడు. దీనివల్ల వచ్చిన రూ.70లక్షల నగదు తీసుకుని రెండు ట్రక్కులో స్వగ్రామానికి బయలుదేరాడు.
 
మంగళవారం తెల్లవారుజామున తెలంగాణా రాష్ట్రం సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలం ముత్తారం వద్దకు రాగానే ఏడుకొండలు మూత్ర విసర్జన కోసం ఆగాడు. అదే సమయంలో ట్రక్కు డ్రైవర్లు నగదుతో ఉడాయించారు. దీంతో షాకైన బాధితుడు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తూఫ్రాన్ మండలం ఇస్లాంపూర్‌ సమీపంలో ఓ ట్రక్కును గుర్తించి సీజ్ చేశారు. నిందితులు మరో ట్రక్కులో పరారైనట్లు గుర్తించిన పోలీసులు వారి కోసం ఐదు స్పెషల్ టీమ్‌లు ఏర్పాటు చేశారు.

నిందితుడు తమ సెల్‌ఫోన్లను ట్రక్కుల్లో వదిలేసి వెళ్లడంతో వాళ్లను ట్రాక్ చేయడం కష్టంగా మారింది. బాధిత వ్యాపారి నుంచి డ్రైవర్ల వివరాలు, ఫోటోలు సేకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ముమ్మరం చేపట్టారు.

లారీలు ఒడిశాకు చెందినవి కాగా.. డ్రైవర్లు ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వారుగా పోలీసులు గుర్తించారు. వారు పక్కా ప్లాన్ ప్రకారమే డబ్బుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసులు చెబుతున్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు