తెలంగాణ ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా ధరలు ఇవే...

బుధవారం, 23 జూన్ 2021 (14:00 IST)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి సంపూర్ణ లాక్డౌన్ ఎత్తివేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రైవేటు ఆస్పత్రుల్లో కరోనా చికిత్స, పరీక్షలు గరిష్ట ధరలను రాష్ట్రప్రభుత్వం ఖరారు చేసింది. 
 
క‌రోనా బాధితుల నుంచి అందిన‌కాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్ప‌త్రుల దోపిడీకి తెలంగాణ ప్ర‌భుత్వం అడ్డుక‌ట్ట వేసేలా చర్యలు తీసుకుంది. ఈ మేర‌కు క‌రోనా చికిత్స ఛార్జీల‌పై వైద్యారోగ్య శాఖ జీవో 40 జారీ చేసింది.
 
సాధార‌ణ వార్డులో ఐసోలేష‌న్‌, ప‌రీక్ష‌ల‌కు రోజుకు గ‌రిష్టంగా రూ.4 వేలు, ఐసీయూ వార్డులో రోజుకు గ‌రిష్టంగా రూ.7,500 వ‌సూలు చేయాల‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్న‌ది. వెంటిలేట‌ర్‌తో కూడిన ఐసీయూ గ‌దికి రోజుకు గ‌రిష్టంగా రూ.9 వేలుగా ఖ‌రారు చేశారు. పీపీఈ కిట్ ధ‌ర రూ.273కు మించ‌రాద‌ని తెలిపింది. 
 
హెచ్ఆర్‌సీటీ రూ. 995, డిజిట‌ల్ ఎక్స్‌రే రూ.1300, ఐఎల్6 రూ.1300, డీ డైమ‌ర్ ప‌రీక్ష రూ.300, సీఆర్‌పీ రూ.500, ప్రొకాల్ సీతోసిన్ రూ.1400, ఫెరిటిన్ రూ.400, ఎల్ డీహెచ్ రూ.140గా ఖ‌రారు చేశారు. సాధార‌ణ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ.2 వేలు, కిలోమీట‌ర్‌కు రూ.75, ఆక్సిజ‌న్ అంబులెన్స్‌కు క‌నీస ఛార్జి రూ.3 వేలు, కిలోమీట‌ర్‌కు రూ.125గా ఖ‌రారు చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు