ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు
శనివారం, 16 జులై 2022 (10:06 IST)
తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. గత వారం రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా జూలై 17 వరకు తెలంగాణ విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు, ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు జూలై 8తో ముగిసింది.
అయితే ఈ వారం రోజులుగా వర్షాలు పడటంతో.. విద్యార్థులు ఫీజు కట్టడంలో ఇబ్బందులు ఎదురైన వారికి ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు మరో అవకాశం కల్పించారు.
తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లించేందుకు మరో రెండు రోజులు అవకాశం ఇచ్చారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు.
ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఈ నెల 18 మరియు 19వ తేదీల్లో రూ. 200 ఫైన్‌తో ఫీజు చెల్లించవచ్చని ఓ ప్రకటన విడుదల చేశారు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు.
పరీక్ష ఫీజు చెల్లించిన విద్యార్థులకు.. ప్రాక్టికల్ పరీక్షలో తప్పిన వారికి.. జూలై 26 నుంచి 30 వరకు ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహించనున్నారు.