మంత్రి కేటీఆర్ గారికి ట్వీట్.. నిలిచిన చిన్నారి ప్రాణం
సోమవారం, 2 మార్చి 2020 (05:11 IST)
ప్రభుత్వ కార్యక్రమాలతో ఎంత బిజీగా ఉన్నా ఆపదలో ఉన్నామంటూ సామాజిక మాధ్యమాల్లో కోరే వారికి సాయం చేస్తుంటారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అందుకే ఏ సమస్య వచ్చినా చాలామంది ట్విటర్‌లో కేటీఆర్‌కు విన్నవిస్తుంటారు.
తాజాగా మరోసారి కేటీఆర్ తన ఔదార్యం చాటారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన చిన్నారి యశస్విని వారం రోజుల క్రితం ప్రమాదవశాత్తు భవనంపై నుంచి కిందపడింది. తీవ్ర గాయాలు కావడంతో బంజారాహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు.
పేద కుటుంబం కావడంతో వైద్య ఖర్చులు భరించలేరని, చిన్నారికి మెరుగైన చికిత్స అందించడం కోసం ఆదుకోవాలని భాను ప్రతాప్ అనే యువకుడు విషయాన్ని ట్విటర్ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లాడు.
దీంతో చిన్నారి వైద్య ఖర్చులకు ఆర్థిక సాయం చేయాలని కేటీఆర్ అధికారులను ఆదేశించారు. సీఎం క్యాంపు కార్యాలయ అధికారులు వెంటనే ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.3.50 లక్షలు మంజూరు చేశారు.
సరైన సమయంలో చికిత్స అందించడంతో ప్రస్తుతం చిన్నారి క్షేమంగా ఉందని, ట్విటర్‌లో తాను పెట్టిన అభ్యర్థనను మన్నించడంతో పాటు ఆదుకున్న కేటీఆర్‌కు ధన్యవాదాలు చెబుతూ భానుప్రతాప్ మళ్లీ ట్వీట్ చేశాడు.
ఈసారి నేరుగా స్పందించిన కేటీఆర్.. ‘సోదరా.. ఈ వార్త చెప్పి ఈరోజు పరిపూర్ణం చేశావు. చిన్నారికి కొంత సాయం చేయడం ఆనందంగా ఉంది’ అంటూ ట్వీట్ చేశారు.