పుస్తక పఠనంతో చిన్నారులలో చురుకుదనం: ఎపి గవర్నర్

మంగళవారం, 28 జనవరి 2020 (07:34 IST)
బాల్యం నుండే మంచి అలవాట్లు ప్రారంభం కావాలని, పుస్తక పఠనం కూడా వాటిలో ఒకటని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ అన్నారు. పుస్తక పఠనం జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తుందని, చిన్నారుల విద్యార్జనకు ఇది పరోక్షంగా సహాయపడుతుందనన్నారు.

విజయవాడ రాజ్‌భవన్‌లో ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ “బాలా సాహితి సూచి” పేరిట రూపొందించిన పిల్లల పుస్తకాల సమాచార దర్శినిని గవర్నర్ ఆవిష్కరించారు. 1963 నుండి 2019 వరకు తెలుగులో విడుదల అయిన 6150 పిల్లల పుస్తకాలకు సంబంధించిన ప్రాధమిక సమాచారాన్ని ఇందులో పొందుపరిచారు.

ఈ నేపధ్యంలో  గవర్నర్ బిశ్వ‌భూషణ్ హరిచందన్ మాట్లాడుతూ పిల్లలను పుస్తక పఠనానికి అలవాటు చేయటం అత్యావశ్యకమని, అది వారిని మరింత తెలివైన వారిగా తీర్చిదిద్దుతుందన్నారు.

పుస్తకపఠనం చిన్నారులను పరిశోధనాత్మకులుగా తయారు చేయటమే కాక, వారిని ఆలోచనపరులుగా మారుస్తుందని గవర్నర్ అన్నారు.

1929లో శ్రీ కాశీనాధుని నాగేశ్వర రావు పంతులు ప్రచురించిన మొట్టమొదటి గ్రంథ పట్టికతో తెలుగులో గ్రంథ పట్టికలను ప్రచురించిన చరిత్రను ప్రారంభమైందని భావించవచ్చని గవర్నర్ అన్నారు.

పుస్తకానికి అవసరమైన సమాచార సేకరణ, కూర్పును అందించిన డాక్టర్ రవి శారదతో పాటు ఆంధ్రప్రదేశ్ లైబ్రరీ అసోసియేషన్ సభ్యులను బిశ్వభూషణ్ ప్రత్యేకంగా అభినందించారు.

కార్యక్రమంలో గవర్నర్ వారి కార్యదర్శి ముఖేష్‌కుమార్ మీనా, శాసనసభ మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్, గ్రంధాలయ సంస్ధ అధ్యక్షుడు చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు