కొడుక్కి పీఠం అప్పగించి.. థ్యాంక్స్ గివింగ్ పార్టీలా కేసీఆర్ తప్పుకుంటారేమో?

గురువారం, 21 జనవరి 2021 (13:11 IST)
తెలంగాణలో సీఎంగా కేటీఆర్ పట్టాభిషేకం జరుగనుందని వార్తలు జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో కేటీఆర్ సీఎం పోస్టుకు సంబంధించి రాములమ్మ కీలక వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్‌ పట్టాభిషేకంపై బీజేపీ నేత విజయశాంతి స్పందించారు. "ఒకవైపు కేటీఆర్‌ను తెలంగాణ కాబోయే సీఎంగా పేర్కొంటూ పట్టాభిషేకం జరిగే అవకాశాలపై మంత్రులే సంకేతాలిస్తున్న తరుణంలో సీఎం కేసీఆర్ గారు ప్రాజెక్టుల చుట్టూ ప్రదక్షిణ చేసి... గోదావరికి హారతులిచ్చి పూజాదికాలు నిర్వర్తించడం పలు అనుమానాలను రేకెత్తించింది. 
 
మంగళవారం నాటి పర్యటనలో కాళేశ్వరం తదితర ప్రాజెక్ట్‌లను కేసీఆర్ గారు ఆకాశానికెత్తేశారు. ఇన్నాళ్లూ కమిషన్ల రూపంలోనో... మరో రూపంలోనో తనను కనికరించిన ఆ ప్రాజెక్టుల వద్ద ఆయన పర్యటనలు, ఆలయాల్లో పూజలు చూస్తే... కొడుక్కి పీఠం అప్పగించి తాను నిష్క్రమించే ముందు ఇస్తున్న థ్యాంక్స్ గివింగ్ పార్టీలా... లేదా కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరుతో వేల కోట్లు దోచుకున్నందుకు పాప పరిహారంగా నదీమ తల్లికి మొక్కులు చెల్లించుకున్నట్టు ఆయన తీరు కనిపిస్తోంది. 
 
రైతాంగం, ప్రజల సంక్షేమం పట్ల సారుకు ఎంత చిత్తశుద్ది ఉందంటే... ఈ ప్రాజెక్టులకు భూములిచ్చిన నిర్వాసితులు ఉపాధి కోసం విజ్ఞప్తి చేసుకోవడానికి వస్తే కలుసుకునే సమయమే లేకుండె పాపం..." అంటూ విజయశాంతి పేర్కొన్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు