హైదరాబాద్‌ పాతబస్తీలో సిలిండర్ పేలుడు.. 13మందికి గాయాలు

గురువారం, 21 జనవరి 2021 (09:51 IST)
హైదరాబాద్‌ పాతబస్తీలో అర్ధరాత్రి తీవ్ర కలకలం రేగింది. మీర్ చౌక్ ప్రాంతంలోని ఓ ఇంట్లో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 13 మంది గాయపడ్డారు. వారిని హుటాహుటిన ఉస్మానియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. అర్ధరాత్రి భారీ శబ్ధంతో పేలుడు సంభవించడంతో చుట్టు పక్కల ప్రజలు ఉలిక్కిపడ్డారు. బాంబు పేలిందేమో అనుకున్నారు. 
 
ఆ ఇంటి నుంచి అరుపులు ఏడుపులు వినిపించడంతో అక్కడికి వెళ్లారు. సిలిండర్ పేలిందని తెలిసి.. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడిన వారిని వెంటనే ఆస్పత్రికి తరలించారు.
 
పేలుడు ధాటికి ఆ ఇళ్లు ధ్వంసమయింది. ఇంట్లోని సామానులంతా చెల్లా చెదురుగా పడిఉన్నాయి. ఘటనా సమయంలో 13 మంది ఇంట్లో ఉన్నారు. సిలిండర్ పేలుడుతో అందరూ గాయపడ్డారు. వారంతా బెంగాల్ నుంచి హైదరాబాద్‌కు వలస వచ్చిన స్వర్ణకారులు.
 
ఐతే బంగారు ఆభరణాల తయారీలో వాడే రసాయనాల వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కాని వాళ్లు మాత్రం సిలిండర్ పేలిందని చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 
 
సిలిండర్ పేలుడు వల్లే ప్రమాదం జరిగిందా? లేదంటే రసాయనాల కారణంగా పేలుడు సంభవించిందా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ ఇంట్లోకి వెళ్లిన క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించే ప్రయత్నం చేస్తోంది.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు