కమలం పార్టీకి రాములమ్మ రాం రాం... కిషన్ రెడ్డికి రాజీనామా లేఖ

గురువారం, 16 నవంబరు 2023 (09:24 IST)
భారతీయ జనతా పార్టీకి సినీ నటి విజయశాంతి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆమె ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపించారు. దీంతో ఆమె రేపు లేదా ఎల్లుండి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకునే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. నిజానికి విజయశాంతి బీజేపీని వీడుతారంటూ గత కొంతకాలంగా ప్రచారం సాగుతుంది. అయితే, ఇటీవల హైదరాబాద్‌లో మాట్లాడుతూ, తాను పార్టీ మారడం లేదని, కమలం పార్టీలోనే ఉంటానని, తాను పార్టీ మారబోతున్నట్టు సాగుతున్న ప్రచారంలో రవ్వంత కూడా నిజం లేదని ఆమె స్పష్టం చేశారు. 
 
ఈ నేపథ్యంలో ఆమె బీజేపీకి తేరుకోలేని షాకిచ్చారు. ఆమె బుధవారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి పంపించారు. ఒకటి లేదా రెండు రోజుల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు. విజయశాంతి కూడా తమ పార్టీలో చేరబోతున్నారంటూ ఆ పార్టీ సీనియర్ నేత మల్లు రవి ఇటీవల ప్రకటించిన విషయం తెల్సిందే. 
 
కాగా, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా బండి సంజయ్‌ను తొలగించినప్పటి నుంచి ఆమె పార్టీ పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. అయితే, ఇటీవల సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో జరిగిన సభలో ప్రధాని నరేంద్ర మోడీ పాల్గొనగా, ఆ సభకు కూడా ఆమె హాజరుకాలేదు. అదేసమయంలో బుధవారం తన ఫేస్‌బుక్, ట్విట్టర్ ప్రొఫైల్‌ పిక్‌ను మార్చి, ఈ రోజు రాత్రి "ఆంధ్రా ప్రజలు ఒకేకానీ.. ఆంధ్రా పార్టీలను ప్రజలు నమ్మరంటూ" ట్వీట్ చేశారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు