తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ లాక్డౌన్ అమలవుతోంది. అయితే, రైతులకు మాత్రం ఈ లాక్డౌన్ ఆంక్షలు వర్తించవచ్చని ప్రభుత్వం స్పష్టంగా చెబుతోంది. అయితే పోలీసులు మాత్రం ఇవేమీ పట్టించుకోవడం లేదు. రోడ్ల మీద కనిపిస్తున్న రైతులను చావబాదుతున్నారు. అన్నదాతలపై లాఠీ ఝళిపిస్తున్నారు.
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, వికారాబాద్ జిల్లా పరిధిలో పొలాలకు వెళ్తున్న రైతులపై గత మూడు రోజుల్లో పోలీసులు తమ ప్రతాపం చూపించారు. ఆదివారం అంబేద్కర్ నగర్ నుంచి తన పొలానికి వెళ్తున్న ఓ రైతును పోలీసులు ఇష్టానుసారంగా కొట్టారు. ఆ రైతు చేతిపై వాతలు పడ్డాయి. తీవ్రనొప్పి ఉండటంతో చేతిని కదపలేకపోతున్నాడు.
'పొలం వద్ద పశువులకు నీరు పెట్టి గడ్డి వేసి వస్తాను సార్' అని చెప్పినా కూడా పోలీసులు అదేమీ వినిపించుకోకుండా కొట్టారని తెలిసింది. అలాగే.. మందుల కోసం మెడికల్ షాపులకు, చికిత్స కోసం ఆస్పత్రులకు వెళ్లే వారిని కూడా పోలీసులు అడ్డుకుంటున్నారని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
వెంకటయ్య అనే వ్యక్తి ఆస్పత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకొని ఆయనకు జరిమానా విధించారు. ఈ విషయం తెలుసుకున్న ఎస్పీ నారాయణ, వెంకటయ్యకు ఆదివారం ఫోన్‌చేసి జరిమానా గురించి ఆలోచించవద్దని ఆరోగ్యం బాగా చూసుకోవాలని సూచించారు. ఉన్నతాధికారులు ఫోన్ చేసి మాట్లాడటంతో వెంకటయ్య సంతోషం వ్యక్తం చేశాడు.