ఆ పాము బుస వింటేనే జనాలకు పైప్రాణం పైనే పోతుంది. ఇక పొరపాటున దాని బారిన పడి కాటుకు గురయ్యామంటే ప్రపంచంలో ఏ ఆసుపత్రికూడా వారిని కాపాడలేదు. నిమిషాల్లో ప్రాణంతీసే ప్రమాదకరమైన విషం దాని సొత్తు. దారిన పోతుంటే కనిపించి దాన్ని కొట్టాలనుకునే లోపే మనిషికి పైకి ఎగిరే దాన్ని లంఘనం చూసి మరోసారి దాని జోలికి పోరు. చివరకు నాగుబాము కాటుకు కూడా సకాలంలో ఆసుపత్రికి చేరిస్తే ప్రాణం దక్కించుకోవచ్చేమో కానీ ఈ పాము కాటునుంచి ఎవరూ తప్పించుకోలేరు. అలాంటి స్కూలు బ్యాగులో చేరిన ఆ పామును తాకి కూడా ప్రాణాలు నిలుపుకున్న ఆ చిన్నారని చూసి ఏమదృష్టం అని పొగుడుతున్నారు.
వింటూనే ఒళ్లు జలదరించే ఈ ఘటన మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలంలోని కోమటిపల్లి ప్రాథమిక పాఠశాలలో మంగళవారం చోటుచేసుకుంది. కోమటిపల్లి శివారు చంద్రుతండాకు చెందిన ఐదో తరగతి విద్యార్థిని అజ్మీరా అఖిల కోమటిపల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుతోంది. స్కూల్లోకి వెళ్లాక బ్యాగు నుంచి పుస్తకం తీయడానికి చేయి పెట్టింది.
చేతికి మెత్తగా తాకినట్లుగా అనిపించడంతో బ్యాగ్‌ను పూర్తిగా తెరిచేసరికి లోపల పాము కనిపించింది. ఆమె ఒక్కసారిగా అరుస్తూ క్లాస్ టీచర్ క్రిష్ణయ్య వద్దకు పరుగెత్తింది. ఆ క్లాస్‌టీచర్, హెచ్‌ఎం సోమిరెడ్డి కలసి క్లాసులో ఉన్న పిల్లలందరినీ బయటకు పంపించారు. వెంటనే దాన్ని కర్రతో కొట్టి చంపేయడంతో ప్రమాదం తప్పింది.