షర్మిల కొత్త పార్టీకి అధ్యక్షుడు ఆయన అయితే... మరి షర్మిల సంగతేంటి?

శుక్రవారం, 4 జూన్ 2021 (10:06 IST)
దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్. రాజశేఖర్ రెడ్డి కుమార్తె వైఎస్. షర్మిల కొత్త రాజకీయ పార్టీని ప్రారంభించారు. ఆ పార్టీకి వైఎస్ఆర్ తెలంగాణ పార్టీగా నామకరణం చేశారు. షర్మిల అనుచరుడు, కుటుంబ సన్నిహితుడు వాడుక రాజగోపాల్‌ ఛైర్మన్‌ లేదా అధ్యక్షుడిగా వైఎస్ఆర్‌ తెలంగాణ పార్టీ పేరు రిజిస్ట్రేషన్‌ కోసం గత ఏడాది డిసెంబరులో దరఖాస్తు చేశారు. 
 
వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయలక్ష్మి ఇచ్చిన నిరభ్యంతర సర్టిఫికెట్‌నూ ఎన్నికల కమిషన్‌కు సమర్పించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు కొత్త పార్టీల రిజిస్ట్రేషన్‌ కోసం వచ్చిన దరఖాస్తుల వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం గురువారం వెల్లడించింది. 
 
వైటీపీకి సీహెచ్‌ సుధీర్‌కుమార్‌ ప్రధాన కార్యదర్శిగా, నూకల సురేష్‌ కోశాధికారిగా వ్యవహరిస్తామంటూ ఆ దరఖాస్తులో పేర్కొన్నట్టు ఎన్నికల సంఘం వెల్లడించింది. పార్టీ రిజిస్ట్రేషన్‌పై ఎవరికైనా అభ్యంతరాలువుంటే ఈ నెల 16 లోగా తమకు తెలియజేయాలని సూచించింది.
 
ప్రస్తుతం రాజగోపాల్... షర్మిల ప్రోగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌గా వ్యవహరిస్తున్నారు. రాజగోపాల్‌ సోదరి, షర్మిల చిన్ననాటి స్నేహితులని లోట్‌సపాండ్‌ వర్గాలు చెబుతున్నాయి. అయితే, ప్రస్తుతానికి ఈ కొత్త పార్టీలో షర్మిలకు ఎలాంటి పోస్టూ లేదు. ఓ సాధారణ కార్యకర్తగానే ఉంటారు. అయితే, కేంద్ర ఎన్నికల సంఘం నుంచి అధికారికంగా లేఖ వచ్చిన తర్వాత షర్మిలను అధ్యక్షురాలిగా ఎన్నుకోవడం లాంఛనమేనని ఆ వర్గాలు తెలిపాయి. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు