తెలంగాణలో జోనల్‌ వ్యవస్థ

శుక్రవారం, 2 జులై 2021 (08:43 IST)
తెలంగాణలో జోనల్‌ వ్యవస్థలో మార్పులకు, చేర్పులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపగా... దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిప్రకారం నారాయణపేట జిల్లా.. జోగులాంబ జోన్‌లో, ములుగు జిల్లా.. కాళేశ్వరం జోన్‌లో, వికారాబాద్‌ జిల్లా చార్మినార్‌ జోన్‌లో ఉంటాయి.

మార్పులకు ఈ సంవత్సరం ఏప్రిల్‌ 19న రాష్ట్రపతి ఆమోదం తెలియజేయగా... కేంద్రం గెజిట్‌ నోటిఫికేషన్‌ ఇచ్చింది. దానిని కేంద్ర హోంశాఖ తెలంగాణ ప్రభుత్వానికి పంపించగా... రాష్ట్రంలో అమలుకు వీలుగా తాజాగా జీవో 128 ఇచ్చింది.

దీని ద్వారా జోనల్‌ వ్యవస్థ పూర్తి స్థాయిలో అమల్లోకి వచ్చినట్లే. ఇప్పటి వరకు ఉన్న అన్ని అడ్డంకులు తొలగిపోయినందున ఉద్యోగ నియామకాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలకు రాష్ట్రం ఈ కొత్త జోనల్‌ విధానాన్ని వర్తింపజేయనుంది.
 
తెలంగాణ ఆవిర్భావం తర్వాత అన్ని ప్రాంతాల్లో సమాన అవకాశాలకు తోడు స్థానికులకు ప్రయోజనాలు కల్పించేందుకు రాష్ట్రం జోనల్‌ వ్యవస్థలో మార్పులు చేసింది. రెండు జోన్లను ఏడు చేసింది.కొత్తగా రెండు బహుళ జోన్లను ఏర్పాటు చేసింది. మొదటి నాలుగు జోన్లను ఒక బహుళ జోన్‌లో, మిగిలిన మూడు జోన్లను రెండో బహుళ జోన్‌లో చేర్చింది.

ఉద్యోగాలను జిల్లా, జోనల్‌, బహుళ జోన్‌, రాష్ట్ర స్థాయి కేడర్లుగా మార్చి మొదటి మూడింటిని ప్రత్యక్ష నియామకాల ద్వారా చేపట్టాలని, రాష్ట్ర స్థాయి పోస్టులను పదోన్నతుల ద్వారా భర్తీ చేయాలని నిర్ణయించింది. ఒకటి నుంచి ఏడు తరగతుల్లో వరుసగా నాలుగేళ్లు చదివితేనే స్థానికులుగా పరిగణించింది. విద్య, ఉద్యోగాలకు జిల్లా, జోనల్‌, బహుళ జోనల్‌ పరిధిలో 95 శాతం స్థానిక, అయిదు శాతం ఓపెన్‌ కేటగిరీగా ప్రకటించింది.

రాష్ట్ర కేడర్‌ పోస్టులు పదోన్నతుల ద్వారా భర్తీ అవుతున్నందున వాటికి రిజర్వేషన్లతో సంబంధం ఉండదని పేర్కొంది. ఈ ప్రతిపాదనలను 2018 మేలో కేంద్రానికి పంపించగా... అవి ఆగస్టులో ఆమోదం పొందాయి. ఆ తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్‌ 31కి తోడు అదనంగా ములుగు, నారాయణపేట జిల్లాలను ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.

2019 ఫిబ్రవరిలో దీనిపై ఉత్తర్వులు జారీచేశారు. రెండు కొత్త జిల్లాలను చేర్చడంతో పాటు ప్రజల విజ్ఞప్తి మేరకు వికారాబాద్‌ జిల్లాను జోగులాంబ జోన్‌ నుంచి చార్మినార్‌ జోన్‌కు మార్చాలని రాష్ట్రం కేంద్రాన్ని కోరింది. కేంద్రం ఏప్రిల్‌లో ఆమోదం తెలిపింది.
 
రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటిదాకా ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న రెండు జోన్లు, 10 జిల్లాల విధానం కిందనే నియామకాలను చేపడుతున్నారు. విద్యాపరంగా సైతం ఇంజినీరింగు, వైద్య విద్య ప్రవేశాలకూ దీనినే పాటిస్తున్నారు. తాజాగా కొత్త జోనల్‌ విధానం పూర్తిగా ఆమోదం పొందడంతో ఇకపై 33 జిల్లాలు, ఏడు జోన్లు, రెండు బహుళ జోన్ల ప్రాతిపదికన కొత్త ఉద్యోగ నియామకాలు జరగనున్నాయి.
 
జిల్లా, జోన్‌, బహుళ జోన్ల కింద ఉద్యోగుల వర్గీకరణ ప్రక్రియ కూడా సాగనుంది. జిల్లాలు పెరిగిన సందర్భంగా ఉద్యోగులను అప్పట్లో తాత్కాలికంగా సర్దుబాటు చేశారు. జిల్లాల పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ పూర్తయినందున వెంటనే ప్రతీ జిల్లాలో ఉండాల్సిన ఉద్యోగుల సంఖ్య (కేడర్‌ స్ట్రెంత్‌)ను ప్రభుత్వం ఖరారు చేయాలి.

పోలీసు శాఖకు చెందిన ఎస్‌పీ కార్యాలయాలు, కమిషనరేట్లకు సంబంధించిన జోన్లు, బహుళజోన్లను సైతం ప్రభుత్వం తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది. జిల్లా, జోన్‌, బహుళ జోన్‌ స్థాయి పోస్టులను నిర్ధారించాలి. ఇప్పటికే ఉద్యోగ, అధికార సంఘాలు నాలుగో తరగతి నుంచి జూనియర్‌ అసిస్టెంటు స్థాయి వరకు జిల్లా పోస్టులుగా, సీనియర్‌ అసిస్టెంటు స్థాయిలోని వాటిని జోనల్‌విగా, గెజిటెడ్‌ ఉద్యోగాలను బహుళ జోన్‌లవిగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించాయి.
 
బహుళ జోన్‌, జోన్‌ల పరిధిలోకి వచ్చే జిల్లాలు ఇవే 
మొదటి బహుళ జోన్‌ 
మొదటి జోన్‌ కాళేశ్వరం: ఆసిఫాబాద్‌-కుమురంభీం, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్‌-భూపాలపల్లి, ములుగు జిల్లాలు.
 
రెండో జోన్‌ బాసర : ఆదిలాబాద్‌, నిర్మల్‌, నిజామాబాద్‌, జగిత్యాల.
మూడో జోన్‌ రాజన్న : కరీంనగర్‌, సిరిసిల్ల రాజన్న, సిద్దిపేట, మెదక్‌, కామారెడ్డి.
నాలుగో జోన్‌ భద్రాద్రి : భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌, వరంగల్‌ (గ్రామీణ), వరంగల్‌ నగర (హన్మకొండ).
 
రెండో బహుళ జోన్‌ 
అయిదో జోన్‌ యాదాద్రి : సూర్యాపేట, నల్గొండ, భువనగిరి యాదాద్రి, జనగామ.
ఆరో జోన్‌ చార్మినార్‌ : మేడ్చల్‌ మల్కాజిగిరి, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్‌.
ఏడో జోన్‌ జోగులాంబ : మహబూబ్‌నగర్‌, నారాయణపేట, జోగులాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు