"వరుడు"గా వస్తోన్న 'బన్నీ' హీరో అల్లు అర్జున్!

WD
స్టైలిష్ హీరో అల్లు అర్జున్ హీరోగా డైనమిక్ డైరక్టర్ గుణశేఖర్ దర్శకత్వంలో యూనివర్శల్ మీడియా పతాకంపై హిట్ చిత్రాల నిర్మాత డి.వి.వి. దానయ్య నిర్మిస్తోన్న భారీ చిత్రానికి "వరుడు" అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

ఈ సినిమా గురించి నిర్మాత డి.వి.వి. దానయ్య మాట్లాడుతూ.. తమ కథకు "వరుడు" అనే టైటిల్ చక్కగా సరిపోతుందన్నారు. ఈ టైటిల్‌ను తాము అడిగిన వెంటనే ఇచ్చిన నిర్మాత నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి)కి పత్రికాముఖంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నామని దానయ్య చెప్పారు.

"వరుడు"గా అల్లు అర్జున్ నటిస్తోన్న ఈ చిత్రం ద్వారా ఓ కొత్త హీరోయిన్‌ను పరిచయం చేస్తున్నామని, అద్భుతమైన సాంకేతిక విలువలతో దర్శకుడు గుణశేఖర్ ఎక్స్‌ట్రార్డనరీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారని నిర్మాత వెల్లడించారు.

ఇందులో తమిళ హీరో ఆర్య విలన్‌గా నటిస్తున్నారని, అంతేగాకుండా రియల్ లైఫ్‌లోని వంద కుటుంబాలు నటించడం విశేషమని దానయ్య అన్నారు. ఈ వంద కుటుంబాలను ఆరు నెలలకు ముందే ఎంపికచేసి వర్క్‌షాప్ నిర్వహించి నటనలో శిక్షణ ఇవ్వడం జరిగిందని ఆయన చెప్పారు.

భారీ ఎత్తున రూపొందుతోన్న ఈ చిత్రంలో ఇంకా సుహాసిని, నరేష్-1, ఆశిష్ విద్యార్థి, షాయాజీ షిండే, ఆహుతి ప్రసాద్, బ్రహ్మానందం, బ్రహ్మాజీ, వినయ్ ప్రసాద్‌లతో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

ఇకపోతే.. శరవేగంగా రూపుదిద్దుకుంటోన్న 'వరుడు' చిత్రానికి సంగీతం: మణిశర్మ, ఫోటోగ్రఫీ: ఆర్.డి. రాజశేఖర్, ఫైట్స్: స్టన్ శివ, ఆర్ట్: అశోక్, ఎడిటింగ్: ఆంథోని, నిర్మాత: డి.వి.వి. దానయ్య, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: గుణశేఖర్.

వెబ్దునియా పై చదవండి