బాలనటులతో 'దానవీర శూరకర్ణ' చిత్రం

శుక్రవారం, 24 అక్టోబరు 2014 (19:30 IST)
శ్రీసాయి జగపతి పిక్చర్స్‌, సంతోష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థలు సంయుక్తంగా అందరూ బాలనటీనటులతో తెరకెక్కబోతున్న చిత్రం 'దానవీరశూరకర్ణ'. జె.వి.ఆర్‌ దర్శకుడు. సి.హెచ్‌ వెంకటేశ్వరరావు, జె.బాలరాజు నిర్మాతలు. ఇటీవల రామానాయుడు కళా మండపంలో పరుచూరి గోపాలకృష్ణ, నటుడు బాలాజీ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 
 
నిర్మాతల్లో ఒకరైన జె.బాలరాజు మాట్లాడుతూ...ఇటీవల పూజా కార్యక్రమాలు మొదలయ్యాయి. హైదరాబాద్‌, విజయవాడ ప్రాంతాల్లో అలంకార్‌ థియేటర్‌ అధినేత కృష్ణార్జునరావు, జగపతి వెంకటేశ్వరరావు సమక్షంలో బాలనటీనటుల కోసం టాలెండ్‌ హంట్‌ నిర్వహించాం. ఉత్సాహవంతమైన బాలబాలికలు ఎందరో హాజరయ్యారు. కొందర్ని ఎంపిక చేశాం. వారికి శిక్షణ ఇచ్చి అతి త్వరలో షూటింగ్‌కు వెళ్తాం. ఒకప్పుడు 'దానవీరశూరకర్ణ' ఎంతటి ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. 
 
ఆ సినిమా పేరు పొగొట్టకుండా అన్ని జాగ్రత్తలు తీసుకొని తెరకెక్కిస్తాం. ఇలాంటి సినిమాను బాలనటులతో చెయ్యడం సాహసకార్యం. మా దర్శకుడు బాగా తెరకెక్కిస్తారనే నమ్మకం ఉంది. కొత్త టెక్నాలజీతో, ఆకర్షణీయమైన గ్రాఫిక్‌తో ఈ చిత్రాన్ని రూపొందిస్తాం. చిన్న పిల్లలతో సినిమా కాబట్టి త్వరగా పూర్తి చేసేయాలని కంగారుపడకుండా కాస్త ఎక్కువ టైమ్‌ తీసుకొని అతి జాగ్రత్తగా చిత్రీకరణ చేస్తాం అని చెప్పారు.

వెబ్దునియా పై చదవండి