యువహీరో రామ్‌చరణ్ తేజ సాహసాలపై మెగాస్టార్ చిరంజీవి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎంతో సినీ కెరీర్ ఉన్న తన కుమారుడు ఆరంభంలోనే ఇలాంటి సహసాలు చేసే సమయంలో చిన్నపాటి అపశృతి దొర్లితే జీవితాంతం దుఃఖించాల్సి వుంటుందని వాపోతున్నారు. ఇదే విషయంపై చరణ్ నుంచి ఒక హామీని సైతం ఈ "డాడీ" పొందినట్టు ఫిల్మ్ నగర్ వర్గాలు సమాచారం.
"మగధీర" చిత్రంలో అద్భుతమైన, సాహసోపేతమైన బైక్ స్టంట్ చేసి చిత్రపరిశ్రమను అబ్బురపరిచిన విషయం తెల్సిందే. ఇందుకోసం చరణ్ పడిన కష్టానికి ఫలితం ఈ చిత్రం విజయంలో లభించింది. అయితే, చరణ్ సాహసాలు ఆయన అభిమానుల ఉత్సాహాన్ని మరింత రెట్టింపు చేస్తుంటే.. చిరంజీవికి మాత్రం బెంగపట్టుకుందట.
చరణ్ నటించే కొత్త చిత్రంలో మరో సాహసం చేయనున్నట్టు సమాచారం. ఇప్పటికే స్కై డైవింగ్‌లో ప్రత్యేక శిక్షణ పొందిన చరణ్.. ఈ డైవింగ్‌ను తన తదుపరి చిత్రంలో ప్రదర్శించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే, తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం ఈ సాహసానికి దూరంగా ఉంటాడో లేదా తన అభిమానులను మరింత ఉత్సాహ పరిచేందుకు డాడీని ఒప్పించి స్కై డైవింగ్ చేస్తారో వేచి చూడాల్సిందే.