'బాహుబలి 2' చిత్రం రూ.2000 కోట్ల వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోనక్కర్లేదు.. సినీ విశ్లేషకులు

శుక్రవారం, 12 మే 2017 (15:10 IST)
దర్శకధీరుడు ఎస్ఎస్.రాజమౌళి, ప్రభాస్ - రానా, అనుష్క, తమన్న, రమ్యకృష్ణ, సత్యరాజ్, నాజర్‌ల కాంబినేషన్‌లో వచ్చిన చిత్రం "బాహుబలి 2". ఈ చిత్రం గత నెల 28వ తేదీన విడుదలై ప్రపంచవ్యాప్తంగా కనకవర్షం కురిపిస్తూ.. భారతీయ చలనచిత్ర రికార్డులన్నీ తిరగరాస్తోంది. ఒక ప్రాంతీయ భాషా చిత్రం ఈ తరహా విజయాన్ని సొంతం చేసుకోవడంతో బాలీవుడ్ చిత్రపరిశ్రమ విస్మయం చెందుతోంది. 
 
ముఖ్యంగా చిత్రం విడుదలైన కేవలం పది రోజుల్లోనే రూ.వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన 'బాహుబలి'.. తాజాగా 1200 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా రికార్డు నెలకొల్పింది. ఒక్క హిందీ వెర్షన్‌లోనే 360 కోట్ల రూపాయలు వసూలు చేసిన 'బాహుబలి-2', అమెరికాలో 100 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించిన తొలి భారతీయ సినిమాగా చరిత్రకెక్కింది.
 
అలాగే, ఓవర్సీస్ మార్కెట్లలో కూడా 'బాహుబలి' ప్రభంజనం కొనసాగుతోంది. ముఖ్యంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, చైనా, చివరకు పాకిస్థాన్‌లో కూడా ఈ చిత్రం భారీ మొత్తంలో వసూళ్లు రాబడుతోంది. దీంతో రూ.1500 కోట్ల వసూళ్ల దిశగా దూసుకెళుతోంది ఈ రికార్డు కూడా ఎంతో దూరంలో లేదని, మున్ముందు 2000 కోట్ల రూపాయలు వసూళ్లు సాధించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సినీ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

వెబ్దునియా పై చదవండి