తెలంగాణ రాష్ట్రంలోని భువనగిరి యాదాద్రి జిల్లాలో దారుణ ఘటన జరిగింది. కట్టుకున్న భర్తను భార్య హతమార్చింది. కారును అద్దెకు తీసుకుని సినీ ఫక్కీలో భర్తను చంపేసింది. ఈ కేసులో ఆమె సోదరుడు కూడా భాగస్వామిగా ఉన్నాడు. సోమవారం జిల్లాలోని కాటేపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో స్వామి అనే వ్యక్తి ప్రాణాలు కోల్పోయాడు.
అయితే, ఈ ప్రమాదంపై స్థానిక పోలీసులకు అనుమానం వచ్చింది. దీంతో ఈ కేసును హత్య కోణంలో విచారించారు. ఈ విచారణలో విస్తుగొలిపే నిజం వెలుగులోకి వచ్చింది. కారును అద్దెకు తీసుకున్న భార్య.. కారుతో ఢీకొట్టించి హత్య చేసినట్టు గుర్తించారు. దీంతో స్వామితో పాటు ఆమె సోదరుడు, కిరాయి ముఠా హంతకులను పోలీసులు అరెస్టు చేసారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.