తెలంగాణకు చెందిన ఫిష్ వెంకట్‌కు ఒక కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. తన కుమార్తెను కొత్తగూడెంలోని ఏ పవర్‌హౌజ్ బస్తీకి చెందిన మెడికల్‌షాపులో పనిచేసే ఓ వ్యక్తికి ఇచ్చి వివాహం జరిపించగా, ఆమె 4 యేళ్లుగా ఏ పవర్‌హౌజ్ బస్తీలో నివాసం ఉంటోంది.
కాగా, ఈమె ఇంటికి పక్కనే ఉన్న వేముల రాజేశం, వేముల ఉపేంద్ర, వేముల ప్రసాద్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది చినికి చినికి గాలివానలా మారింది. ఈ క్రమంలో గత నెల 30వ తేదీన వెంకట్‌తో పాటు 8 మంది కొత్తగూడెం వచ్చి, వేముల ప్రసాద్ ఇంటి ఎదుట అర్థరాత్రి వరకు నానా యాగీ చేశారు. ఈ విషయాన్ని ప్రసాద్ వన్‌టౌన్ పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా అక్కడకు చేరుకున్న ఎస్‌ఐ తిరుపతి సర్ది చెప్పి పంపించేశారు.
మళ్లీ ఈనెల 4వ తేదీన అతిగా మద్యం తాగి ఫిష్ వెంకట్... కాస్త దురుసుగా ప్రవర్తించాడు. బాధితులు ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకువెళ్లగా వారు మందలించి వదిలేశారు. అయినా తీరుమారని ఫిష్ వెంకట్, అతడి ఇద్దరు కుమారులతో పాటు మరి కొంతమందితో వచ్చి మళ్లీ వేముల ప్రసాద్, ఉపేంద్ర, రాజేశంపై దాడి చేసేందుకు ప్రయత్నించడంతో వారు ఒకటో పట్టణ పోలీసులను ఆశ్రయించారు. దీంతో పోలీసులు ఫిష్ వెంకట్‌పై కేసునమోదు చేశారు.