మెగాస్టార్ చిరంజీవి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించి నిర్మిస్తున్న 150వ చిత్రం 'కత్తిలాంటోండు'. ఈ చిత్రంలో హీరోయిన్‌పై ఇప్పటికీ ఓ స్పష్టత లేదు. హీరోయిన్ల ఎంపికపై ఒక్కో రోజు ఒక్కో కథనం వస్తోంది. అయితే, తాజాగా ఫిల్మ్ నగర్‌లో హల్‌చల్ చేస్తున్న వార్త ఒకటి వినడానికి ఆసక్తిగా ఉంది. అందేంటంటే... మెగాస్టార్ సరసన సీనియర్ నటి విజయశాంతి నటించే అవకాశాలు ఉన్నట్టు వస్తున్నాయి. ఇందుకోసం విజయశాంతిని ఆ చిత్ర యూనిట్ సంప్రదిస్తున్నట్టు సమాచారం. తన 150వ చిత్రంలో విజయశాంతికి అత్యంత కీలకమైన పాత్ర ఇచ్చేందుకు చిరంజీవి సమ్మతించడంతో ఆమెను చిత్ర యూనట్ వర్గాలు సంప్రదించే పనిలో పడినట్టు వినికిడి.
నిజానికి వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన అనేక చిత్రాలు బంపర్ హిట్ అయ్యాయి. అయితే, ఈ ఇద్దరూ రాజకీయాల్లోకి ప్రవేశించిన తర్వాత ఒకరిపై ఒకరు అనేక విమర్శలు, ప్రతి విమర్శలు గుప్పించుకున్నారు. కానీ, చిరంజీవి మాత్రం ఇవేమీ పట్టించుకోకుండా విజయశాంతికి ఓ రోల్ ఇచ్చేందుకు మొగ్గుచూపారు. ఈ వార్త నిజమైతే వెండితెరపై 12 యేళ్ళ తర్వాత చిరంజీవి - విజయశాంతి కాబినేషన్‌ను చూసే భాగ్యం కలగనుంది.