దర్శకుడు మణిరత్నం ఇంటిముందే ఆత్మహత్య చేసుకుంటానంటున్న లైట్‌మెన్

బుధవారం, 19 ఏప్రియల్ 2017 (17:21 IST)
భారతీయ చిత్రపరిశ్రమలోనే తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న దర్శకదిగ్గజం మణిరత్నం. ఈయన ఇంటి ముందు ఆత్మహత్య చేసుకోనున్నట్టు ఓ లైట్‌మెన్ ప్రకటించారు. ఈ ప్రకటన సంచలనం రేపుతోంది. ఓ లైట్‌మెన్ ఈ తరహా ప్రకటన చేయడానికి గల కారణాలను పరిశీలిస్తే... 
 
గతంలో మణిరత్నం దర్శకత్వంలో అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యరాయ్‌లతో ‘గురు’ సినిమా వచ్చిన విషయం తెల్సిందే. ఆ సినిమా షూటింగ్ సమయంలోనే మణిమారన్‌ అనే లైట్‌మెన్‌కు ప్రాణాంతకమైన రక్తసంబంధిత వ్యాధి వచ్చిందట. దీంతో వైద్య ఖర్చుల కోసం చిత్ర యూనిట్ సాయం కోరాడు. 
 
అయితే చిత్ర యూనిట్ నుంచి అతడికి ఎలాంటి సాయం లభించలేదట. దీంతో మణిమారన్ సాయం కోసం కోర్టు మెట్లు ఎక్కాడట. అతడికి అనుకూలంగా తీర్పునిచ్చిన కోర్టు.. రూ.2 లక్షల పరిహారం చెల్లించాలంటూ ఆదేశించిందని కోలీవుడ్ మీడియా చెబుతోంది.
 
కోర్టు తీర్పునిచ్చినా మణిరత్నంగానీ, లైట్‌మెన్ యూనియన్‌గానీ పట్టించుకోలేదు. పదేళ్ల నుంచి వైద్య ఖర్చులు భరిస్తున్నామని, ఇక ఆ స్థోమత తమకు లేదని, మణిరత్నం ఖచ్చితంగా సాయం చేయాలని, లేకపోతే మణిరత్నం ఇంటి ముందు ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని, ఆత్మహత్యకూ వెనకాడబోనని హెచ్చరించాడు. ప్రస్తుతం ఇది కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. 

వెబ్దునియా పై చదవండి