సినీ ఇండస్ట్రీలో గొడవలు మామూలే. తాజాగా జరిగిన మా ఎన్నికల్లో ప్రకాష్ రాజ్ ప్యానలుకి మెగాస్టార్ మద్దతివ్వడం, మోహన్ బాబుకి మంచు విష్ణును పోటీ నుంచి వైదొలగాలని విజ్ఞప్తి చేయడం, ఆ తర్వాత ఎన్నికలు హీటెక్కడం, మెగాస్టార్ వర్సెస్ మంచుగా మారిపోయింది. హ్యాపీగా స్టేజీలపై జోకులేసుకునే మోహన్ బాబు- చిరంజీవి ఇపుడు ఎడమొహం పెడమొహం అయ్యారు.
ఇక అసలు విషయానికి వస్తే... విష్ణు మా అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరణ వేడుకకు బాలయ్యను ఆహ్వానించారు. అది కూడా స్వయంగా మోహన్ బాబు, విష్ణు ఇద్దరూ వెళ్లి పిలిచారు. కానీ మెగాస్టార్ చిరంజీవికి కనీసం రమ్మని ఫోన్ కూడా చేయలేదని టాలీవుడ్ సినీ వర్గాల భోగట్టా.
దీనితో చిరంజీవి ఫంక్షనుకి రాలేదు. పిలవలేదు కనుక రాలేదు మెగాస్టార్ అనుకుంటున్నారు. ఐతే ఒకరికి ఇద్దరు వెళ్లి బాలయ్యను రమ్మని పిలిచినా సింహా రాకపోవడంతో విష్ణు కంగుతిన్నట్లు భోగట్టా. ఎన్నికల్లో ఎన్ని వున్నప్పటికీ ముగిశాక ఫ్రెండ్సుగా వుండాలన్నది బాలయ్య అభిమతమని అంటున్నారు. చిరంజీవిని ఆహ్వానించలేదని తెలిసి బాలయ్య కూడా గైర్హాజరైనట్లు చెప్పుకుంటున్నారు. మరికొందరైతే తెరాస మంత్రి తలసాని వస్తున్నారని తెలిసి బాలయ్య గమ్మున ఇంట్లో కూర్చున్నారని అంటున్నారు. మరి నిజం ఏంటో?