యంగ్ టైగర్ ఎన్టీఆర్ - మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తోన్న ప్రెస్టేజీయస్ మూవీ ఆర్ఆర్ఆర్. భారీ చిత్రాల నిర్మాత డి.వి.వి దానయ్య ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. 2021లో జనవరి 8న ఈ సంచలన చిత్రాన్ని రిలీజ్ చేయనున్నట్టు అఫిషియల్ ఎనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. జులై 30న రిలీజ్ చేయాలి అనుకున్నారు జనవరి 8కి వాయిదా వేసారు. ఈసారి రిలీజ్ డేట్ ఛేంజ్ చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోను జనవరి 8న రిలీజ్ చేయాలి అనే ఉద్దేశ్యంతో... రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసినప్పటి నుంచి షూటింగ్‌లో మరింత స్పీడు పెంచారు.
అయితే.. రిలీజ్ డేట్ పైన క్లారిటీ వచ్చినప్పటి నుంచి ఆర్ఆర్ఆర్ అప్‌డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని మెగా ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మార్చి 25న ఉగాది, మార్చి 27న చరణ్ పుట్టినరోజు ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజుగా చరణ్ లుక్‌ని రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ హైదరాబాద్‌లో కంప్లీట్ అయిన తర్వాత పూణెలో భారీ షెడ్యూల్ ప్లాన్ చేసారు. ఇక పూణె షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనుకుంటుండగా చరణ్ కాలికి గాయం అయ్యింది.
అంతే.. పూణె షెడ్యూల్ క్యాన్సిల్ చేసారు. ఆ తర్వాత హైదరాబాద్ లోనే షూటింగ్ చేసారు కానీ.. పూణెలో షూటింగ్ చేయలేదు. ఇప్పుడు పూణెలో ఓ షెడ్యూల్ ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ సినిమాలో చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుంటే.. బాలీవుడ్ హీరోయిన్ అలియాభట్ సీత పాత్ర పోషిస్తుంది. ఈ షెడ్యూల్లో రామ్ చరణ్, అలియాభట్ పై రొమాంటిక్ సీన్స్ చిత్రీకరించనున్నారని తెలిసింది. ఇప్పటి వరకు దాదాపు 80 పర్సంట్ షూటింగ్ పూర్తయ్యింది. మిగిలిన 20 పర్సంట్ షూటింగ్‌ని అనుకున్న టైమ్‌కి కంప్లీట్ చేయడం కోసం చాలా ఫాస్ట్‌గా షూటింగ్ చేస్తున్నారు.
మే నెలాఖరుకు షూటింగ్ మొత్తం పూర్తి చేయాలనుకుంటున్నారు. ఆ తర్వాత జూన్ నుంచి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేయనున్నారు. బాహుబలి సినిమాని విజువల్ వండర్ అనేలా తీర్చిదిద్దిన జక్కన్న ఆర్ఆర్ఆర్‌ను కూడా విజువల్ వండర్ అనేలా... ఆడియన్స్‌కి ఓ అద్భుతం చూసిన ఆనందం కలిగించేలా... ఈ మూవీని రూపొందిస్తున్నారు. అందుకనే పోస్ట్ ప్రొడక్షన్ వర్క్‌కి ఎక్కువ టైమ్ కేటాయించారు. బాహుబలి 2 సినిమా రికార్డులే టార్గెట్‌గా జక్కన్న ఆర్ఆర్ఆర్ మూవీని మరో అద్భుతం అనేలా తెరకెక్కిస్తున్నారు. మరి.. బాక్సాఫీస్ వద్ద ఆర్ఆర్ఆర్ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.