మలయాళ చిత్రం 'ప్రేమమ్' ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందులోను నటించిన కథానాయికలకు పెద్ద వరంగా మారిందనే చెప్పాలి. అందులో ముఖ్యంగా మలర్ పాత్రలో టీచర్‌గా నటించిన సాయి పల్లవి నటనకు ప్రశంసలు వర్షం కురిపించారు. దీంతో సహజంగానే ఆ చిత్ర హీరోయిన్లు ముగ్గురిపై కోలీవుడ్ దృష్టి పడింది. అయితే సాయిపల్లవి మినహా ఇతర భామలు మంజిమామోహన్, మడోనా సెబాస్టియన్‌లకు ఇప్పటికే కోలీవుడ్‌లో అవకాశాలు వెల్లువలా కురుస్తున్నాయి. ఇక సాయి పల్లవికి కోలీవుడ్ దర్శకుడు మణిరత్నం దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారి పోయింది.
కార్తీకి జంటగా కాట్రు వెలియిడై చిత్రంలో నటించాల్సింది. చివరి క్షణంలో బాలీవుడ్ భామ అతిథిరావు రంగంలోకి దిగింది. మణిరత్నం చిత్రం చేయిజారడం సాయిపల్లవికి పెద్ద దెబ్బే. చాలా నిరాశకు గురైనట్లు ప్రచారం జరిగింది. అయితే తాజాగా మరో అవకాశం తలుపు తట్టిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సంచలన దర్శకుడుగా పేరొందిన సెల్వరాఘవన్ దర్శకత్వంలో సంతానంతో రొమాన్స్ చేయడానికి సాయి పల్లవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
సంతానం ప్రస్తుతం వీటీవీ ప్రొడక్షన్స్ పతాకంపై సేతురామన్ దర్శకత్వం వహిస్తున్న చిత్రంలో నటిస్తున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ చిత్రం కూడా ఆయన తాజా చిత్రానికి సమాంతరంగా చిత్రీకరణ జరుపుకోనున్నట్లు సమాచారం. కొన్ని మంచి మంచి అవకాశాలు మిస్ అయిన తర్వాత ఈ సినిమాతో ఆమె కోలీవుడ్‌కు ఎంట్రీ ఇస్తోంది. ప్రస్తుతం టాలీవుడ్ లో మెగా హీరో వరుణ్‌తేజ్‌తో ఫిదా సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది సాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది.