సౌందర్య పాత్రలో సాయిపల్లవి : తెలుగులో మరో బయోపిక్

ఆదివారం, 11 అక్టోబరు 2020 (15:51 IST)
కన్నడ నటి సౌందర్య. వెండితెర అరంగేట్రం చేసిన అతి తక్కువ కాలంలో మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్న హీరోయిన్. పైగా, అభినవ సావిత్రి అనే బిరుదు సొంతం చేసుకుంది. ఈమె దాదాపు వందకు పైగా చిత్రాల్లో నటించింది. 
 
తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో ఆమెకు వీరాభిమానులున్నారు. దురదృష్టవశాత్తు కేవలం 31 ఏళ్లకే హెలికాప్టర్ ప్రమాదంలో కన్నుమూసిన సౌంద‌ర్య భౌతికంగా మ‌న మ‌ధ్య లేకపోయిన సినిమాల ద్వారా మ‌న గుండెల‌లో చిర‌స్థాయిగా నిలిచి ఉన్నారు. 
 
'మనవరాలి పెళ్లి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన సౌంద‌ర్య‌ "అమ్మోరు" సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపోయింది. కెరీర్ కొత్తలోనే పెదరాయుడు, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు లాంటి బ్లాక్ బస్టర్ సినిమాతో సౌందర్య రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. 
 
ఎక్స్‌పోజింగ్‌కు దూరంగా ఉంటూ నెంబర్ వన్ హీరోయిన్‌గా మారింది. ఓ హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయే వరకు కూడా సినిమాలు చేస్తూనే ఉంది. సౌంద‌ర్య జీవితం ఎంతో మందికి ఆద‌ర్శం. ఈ క్ర‌మంలోనే కొంద‌రు మేక‌ర్స్ ఆమె బ‌యోపిక్ తెర‌కెక్కించే ఏర్పాట్లు చేస్తున్నారు. 
 
ఇప్పటికే ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తి కాగా, ఈ బయోపిక్‌లో సౌంద‌ర్య‌గా గ్లామ‌ర్ భామ సాయి ప‌ల్ల‌వి న‌టించ‌బోతున్న‌ట్టు తెలుస్తుంది. స‌హ‌జ‌న‌టిగా సౌంద‌ర్య సాధించిన ఘ‌న‌తలు, ఆమె న‌ట ప్ర‌స్థానం త‌దిత‌ర అంశాల‌ను ప్రేక్ష‌కుల మ‌న‌సుల‌ని క‌ట్టిప‌డేలా రూపొందిస్తార‌ట‌. అయితే ఈ వార్తపై క్లారిటీ రావాల్సివుంది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు