ప్రస్తుతం ఉన్న కాలంలో ఓ సినిమా యాభై రోజులు విజయవంతంగా ప్రదర్శింపబడటం మామూలు విషయం కాదు. ఏకంగా 103 కేంద్రాలలో అఖండ యాభై రోజులు పూర్తి చేసుకుందని ఇందుకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలుపుతూ నందమూరి బాలకృష్ణ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని ఆర్.టి.సి. క్రాస్ రోడ్‌లోని సుదర్శన్ 35ఎం.ఎం.లో అభిమానుల సమక్షంలో వేడుక జరగనుంది.
ఈ మధ్య కాలంలో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలు తెచ్చిన చిత్రంగా అఖండ నిలిచింది. ఓవర్సీస్‌లోనూ చిత్రం లాభాల బాట పట్టింది. యూకే, ఆస్ట్రేలియాలో సినిమాకు అద్బుతమైన రెస్పాన్స్ రాగా అమెరికాలో ఏకంగా వన్ మిలియన్ డాలర్ మార్క్‌ను క్రాస్ చేసింది.
ఒమిక్రాన్ కేసులు పెరిగినా, పరిస్థితులు బాగా లేకపోయినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టించింది. ప్రతీ వారం కొత్త సినిమాలు వచ్చినా కూడా అఖండ మాత్రం బాక్సాఫీస్ వద్ద సత్తా చాటుతూనే వచ్చింది. ఏడో వారంలో కూడా అఖండ మంచి వసూళ్లను రాబట్టింది.
టీం అంతా కలిసి అద్భుతంగా పని చేయడం వల్లే ఈ స్థాయి విజయం దక్కింది. బోయపాటి కథ, మేకింగ్, యాక్షన్ ఎపిసోడ్స్, బాలయ్యను రెండు పాత్రల్లో డిఫరెంట్ షేడ్స్ లో చూపించిన విధానం ఈ సినిమాలో హైలెట్ గా నిలిచింది. ఇక తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సీ రామ్ ప్రసాద్ సినిమాటోగ్రఫీ, ద్వారక ప్రొడక్షన్ నిర్మాణ విలువలు అన్నీ కలిసి సినిమాను బ్లాక్ బస్టర్ చేశాయి.