వరుస ప్లాప్‌లు తెచ్చిన అనుభవమో లేక ఇప్పటికైనా మేలుకోకపోతే కోలుకోవడం కష్టమనుకున్నారో కానీ రజనీకాంత్ మీడియా సపోర్టు కోసం ప్రయత్నిస్తున్నట్లు సూచనలు వస్తున్నాయి. ముఖ్యంగా కొత్త సినిమాలను సమీక్షించేటప్పుడు గాయపర్చే వ్యాఖ్యలు చేయకండి ప్లీజ్ అంటూ మీడియాను అభ్యర్థించేశారు రజనీ. విక్రమ్ ప్రభు తాజా చిత్రం నెరుప్పు డా తమిళం ఆడియో ప్రారంభోత్సవంలో మాట్లాడిన రజనీకాంత్ చిత్ర సమీక్షకులు, విమర్శకులకు విలువైన సలహా ఇచ్చారు. గాయపర్చకుండానే సినిమాను విమర్శనాత్మకంగా విశ్లేషించండ ముఖ్యం అనేశారు.
సినిమాలు తీయడం మా బాధ్యత. సినిమాలను సమీక్షించడం మీ కర్తవ్యం. కానీ సినిమాను విమర్శిస్తున్నప్పుడు మీరు మీ అభిప్రాయాన్ని ఎలా వ్యక్తీకరిస్తున్నారు అనేది ముఖ్యం. దయచేసి గాయపర్చే వ్యాఖ్యలను చేయవద్దు. ఒకసినిమాపై మీ ఆలోచనలను నమోదు చేస్తున్నప్పుడు సముచితమైన పదాలనే ఉపయోగించాలని అభ్యర్థిస్తున్నా అని రజనీ పేర్కొన్నారు.
అలాగే సినిమా విడుదలైన మరుక్షణం సమీక్ష చేయడం చిత్రపరిశ్రమ భవిష్యత్తుకు మంచిది కాదన్నారు రజనీకాంత్. థియేటర్లలో మూడు లేదా నాలుగు రోజులు ఆడిన తర్వాతే సినిమాను సమీక్షించాలని ఆయన అభ్యర్థించారు. సినిమాను సమీక్షించడం అనేది మీ భావ స్వేచ్ఛ. ప్రతి ఒక్కరికీ తమ తమ అభిప్రాయాలుంటాయి. కానీ సినిమాకు కాస్త ఊపిరి పీల్చుకునే సమయం ఇవ్వండి. దయచేసి చిత్రం విడుదలైన నాలుగోరోజు మాత్రమే సినిమాను సమీక్షించండి.కనీసం మూడు రోజులైనా సినిమా థియేటర్లలో నడవనివ్వండి అని రజనీ అభ్యర్థించారు.