కృష్ణంరాజు ఇకలేరు.. జర్నలిస్టుగా జీవితాన్ని ప్రారంభించి రెబెల్‌స్టార్‌గా...

ఆదివారం, 11 సెప్టెంబరు 2022 (10:35 IST)
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన అగ్రహీరో రెబెల్ స్టార్ కృష్ణంరాజు ఇకలేరు. ఆయన అనారోగ్యంతో బాధడుతూ ఆదివారం వేకువజామున తుదిశ్వాస విడిచారు. తెలుగు ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా చెరగని ముద్ర వేసిన ఆయన 1940 జనవరి 20వ తేదీన వెస్ట్ గోదావరి జిల్లా మొగల్తూరులో ఓ ఉన్నత కుటుంబంలో జన్మించారు. ఆయన పూర్తి పేరు శ్రీ ఉప్పులపాటి చిన వెంకట కృష్ణంరాజు. తన పూర్తి పేరులోని శ్రీ, చిన వెంకట అనే పదాలను తొలగించి ఉప్పలపాటి కృష్ణంరాజుగా ఆయన ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈయన తన చదువు పూర్తిగా కాగానే జర్నలిస్టుగా తన జీవితాన్ని ప్రారంభించారు. 
 
ఫోటోగ్రఫీపై ఉన్న మక్కువతో హైదరాబాదులో రాయల్‌ స్టూడియో మొదలుపెట్టారు. ఆ తర్వాత మిత్రుల ప్రోత్సాహంతో సినీరంగంలో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు మద్రాసు వెళ్లారు. అక్కడ ప్రముఖ దర్శకుడు ప్రత్యగాత్మ చేయూతనందించగా ఐదు దశాబ్దాలు సినీరంగంలో ప్రయాణించారు. తెలుగు సినీరంగంలో ఎన్టీఆర్​, అక్కినేని తర్వాత రెండో తరం వచ్చిన హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. 
శోభన్‌బాబు, కృష్ణ వెండితెరకు పరిచయం అయినా కొన్నాళ్లకే 1966లో వచ్చిన "చిలకా గోరింకా" చిత్రంతో కృష్ణంరాజు.. వెండితెరకు హీరోగా పరిచయం అయ్యారు. అయితే తొలిచిత్రం ఆయనకు నిరాశనే మిగిల్చింది. ఈ ఫ్లాప్‌తో ఆయనకు ఏమీ సంబంధం లేదని మిత్రులు, దర్శక నిర్మాతలు సర్దిచెప్పినా ఆయన సమాధానపడలేదు. 
 
నటనను మెరుగుపరచుకునేందుకు తనకు తానే శిక్ష విధించుకున్నారు. నటనలో రాటు దేలేందుకు ప్రముఖులు రాసిన పుస్తకాలు చదివారు. పాతకాలం నటుడు సీహెచ్​ నారాయణరావు వద్ద శిక్షణ తీసుకున్నారు. నటనలో పూర్తిస్థాయిలో సంతృప్తి చెందేవరకు ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకున్నారు. ఇది ఆయనలోని నిబద్ధతకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు.
 
తర్వాత డొండీ నిర్మాణ సారథ్యంలో "అవేకళ్లు" చిత్రంలో విలన్‌గా అలరించారు. ఆ చిత్రంలో విలన్‌ పాత్రలో ఆయన నటనకు విమర్శకుల నుంచీ కూడా ప్రశంసలు అందుకున్నారు. అప్పటికే ప్రఖ్యాత విలన్‌ ఆర్‌.నాగేశ్వరరావు చనిపోవడంతో అంతా ఆయన్ను మరో ఆర్‌ నాగేశ్వరరావు తెలుగు తెరకు వచ్చారన్నారు.
 
'అవేకళ్లు' చిత్రంలో విలన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న కృష్ణంరాజు.. తర్వాత వరుసగా 30 సినిమాల్లో విలన్‌ వేషాలే వేశారు. అయితే విలనిజంలో కూడా ప్రత్యేకత ఉంటేనే చేస్తానని కరాఖండిగా చేప్పేవారు. ఎన్టీఆర్​, ఏఎన్నార్​, శోభన్‌బాబు, కృష్ణ చిత్రాల్లో విలక్షణమైన ప్రతినాయకుడి పాత్రలు పోషించి యంగ్‌ విలన్‌గా పేరు తెచ్చుకున్నారు. విలన్‌ వేషాల తర్వాత పలు చిత్రాల్లో హీరో సపోర్టింగ్‌ క్యారెక్టర్స్‌ కూడా లభించాయి. 
 
ఆయనకు ఎన్టీఆర్​తో 'భలేమాస్టార్‌', 'బడిపంతులు', 'వాడేవీడు', 'పల్లెటూరి చిన్నోడు', 'మనుషుల్లో దేవుడు', 'మంచికి మరోపేరు', 'సతీసావిత్రి' చిత్రాల్లో నటించారు. అక్కినేని కాంబినేషన్‌లో బుద్ధిమంతుడు, జైజవాన్‌, పవిత్రబంధం, మంచిరోజులు వచ్చాయి, మాతృమూర్తి చిత్రాల్లో విలన్‌గా నటించి మెప్పించారు. ఏఎన్నార్​ హీరోగా తెరకెక్కిన 'ఎస్పీ భయంకర్‌' చిత్రంలో సపోర్టింగ్‌ హీరోగా నటించారు. 
 
హీరో కృష్ణ కాంబినేషన్‌లో 17 చిత్రాల్లో హీరోగా నటించారు కృష్ణంరాజు. శోభన్‌బాబుతో బంగారు తల్లి, మానవుడు దానవుడు, జీవనతరంగాలు చిత్రాల్లో విలన్‌గా నటించారు. ఇద్దరు ఇద్దరే, కురుక్షేత్రం, రామబాణం, జీవితం చిత్రాల్లో సపోర్టింగ్‌గా నటించారు. ప్రత్యగాత్మ దర్శకత్వంలో వచ్చిన "ఇంటిదొంగలు" చిత్రంతో కృష్ణంరాజు.. మళ్లీ హీరోగా మారారు. అయితే ఆ చిత్రం లేడీ ఓరియంటెడ్‌ అయినప్పటికీ ప్రత్యగాత్మతో ఉన్న అనుబంధం కారణంగా అంగీకరించారు. 
 
విలన్‌గా వెలుగొందుతున్న రోజుల్లోనే గోపికృష్ణా మూవీస్‌ పేరుతో నిర్మాణ సంస్థను స్థాపించి వరుసగా చిత్రాలు నిర్మించారు. స్వంత బ్యానర్‌లో వచ్చిన తొలి చిత్రం "కృష్ణవేణి". 12 కేంద్రాల్లో శతదినోత్సవం జరుపుకుంది. ఆ చిత్రంతో ఆయన హీరోగా వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం లేకుండా పోయింది. వరుసగా బయటి నిర్మాణ సంస్థల నుంచి హీరోగా అవకాశాలు రావడంతో బిజీగా మారిపోయారు.
 
సొంత బ్యానర్‌ గోపికృష్ణా మూవీస్‌లో కృష్ణంరాజు నటించిన రెండో చిత్రం "భక్తకన్నప్ప". అప్పట్లో ఈ సినిమా రికార్డులు బద్దలు కొట్టింది. ఆయన కేరీర్‌లోనే గొప్ప చిత్రంగా మిగిలిపోయింది. చిత్రం విడుదల అయిన అన్నీ కేంద్రాల్లో 25 వారాలు ఆడింది. క్లైమాక్స్‌లో భక్తకన్నప్ప కన్ను పెకిలించి శివునికి అర్పించే సన్నివేశానికి థియేటర్లలో అద్భుతమైన స్పందన వచ్చింది. భక్తకన్నప్పగా కృష్ణంరాజు ప్రదర్శించిన నటన నభూతో అన్నారు.
 
వరుసగా బయటి నిర్మాణ సంస్థల్లో చిత్రాలు చేస్తున్న కృష్ణంరాజుకు సొంత బ్యానర్‌లో చిత్రాలు చేసేందుకు చాలా గ్యాప్‌ వచ్చింది. మూడో చిత్రం విజయం సాధించకపోవడంతో గోపికృష్ణా బ్యానర్‌ను మళ్లీ నిలబెట్టేందుకు 1984లో "బొబ్బిలి బ్రహ్మన్న" చిత్రాన్ని చేశారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ఆ సినిమా.. అఖండ విజయాన్ని సాధించింది. కృష్ణంరాజులోని మరో కోణాన్ని ఆవిష్కరించింది.
 
"బొబ్బిలి బ్రహ్మన్న" తర్వాత చారిత్రక చిత్రాన్ని చేయాలన్న తన కోరికను "తాండ్రపాపరాయుడు" ద్వారా తీర్చుకున్నారు. రంగూన్‌ రౌడీ, కటకటాల రుద్రయ్య చిత్రాలకు దర్శకత్వం వహించిన దాసరి నారాయణరావుకు దర్శకత్వ బాధ్యతలు అప్పగించారు. భారీ బడ్జెట్‌తో రూపొందిన 'తాండ్రపాపారాయుడు' కమర్షియల్‌గా పెద్ద హిట్‌ కానప్పటికీ పరిశ్రమలో మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది. 'తాండ్రపాపరాయుడు' పాత్రలో ఆయన ప్రదర్శించిన రౌద్రరసం సినీ విమర్శకులను మెప్పించింది.
 
బాపు దర్శకత్వంలో వచ్చిన బుల్లెట్‌ చిత్రంలో మొరటోడిగా నటించి మెప్పించారు. త్రిశూలం, బెబ్బులి, పులి బెబ్బులి, పల్నాటి బ్రహ్మనాయుడు, విశ్వనాథ నాయకుడు, రంగూన్‌ రౌడీ, పులిబిడ్డ, ఉగ్రనరసింహం, ధర్మాత్ముడు, ధర్మతేజ చిత్రాలు ఆయనకు మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. కుర్రహీరోల చిత్రాల్లో ఎన్నో మంచి పాత్రలు చేశారు కృష్ణంరాజు. "నీకు నేను నాకు నువ్వు" చిత్రంలో నిబద్ధత కలిగిన తండ్రి పాత్రలో చక్కగా నటించారు. 
 
రామోజీ ఫిల్మ్‌సిటీలో ఆద్యంతం చిత్రీకరించిన "మా నాన్నకు పెళ్లి" చిత్రంలో కృష్ణంరాజు ప్రధాన పాత్ర పోషించారు. ఈవీవీ దర్శకత్వంలో వచ్చిన ఆ చిత్రం ఘనవిజయం సాధించింది. నటవారసుడు ప్రభాస్‌తో కలిసి "బిల్లా" చిత్రంలో పవర్‌ఫుల్‌ పోలీసు పాత్ర చేసిన కృష్ణంరాజు.. "రుద్రమదేవి"లాంటి భారీ చిత్రంలో గణపతి దేవుని పాత్రలో తనదైన నటనతో మెప్పించారు. 
 
కృష్ణంరాజు విలక్షణమైన నటనాశైలి కారణంగా ఆయన్ను ఎన్నో అవార్డులు వరించాయి. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం 1977లో 'అమరదీపం' చిత్రానికి, 1984లో 'బొబ్బిలి బ్రహ్మన్న' చిత్రంలో ఆయన ప్రదర్శించిన నట విశ్వరూపానికి నంది అవార్డులతో సత్కరించింది. 1986లో 'తాండ్రపాపారాయుడు' చిత్రానికి ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకున్న కృష్ణంరాజు.. 2006లో ఫిల్మ్‌ఫేర్‌ దక్షిణాది జీవితసాఫల్య పురస్కారాన్ని తీసుకున్నారు. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు