తమిళ సినిమా రంగంలోనూ, తమిళ రాజకీయ వర్గాల్లో ప్రస్తుతం సూపర్ స్టార్ రజనీకాంత్ గురించే చర్చ సాగుతోంది. 9 సంవత్సరాల తర్వాత ఇటీవల తన అభిమానులను కలిసిన రజనీకాంత్.. తన రాజకీయ ప్రవేశంపై పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. కానీ రజనీకాంత్ రాజకీయ ప్రవేశంపై సోషల్ మీడియాలో, కోడంబాక్కం ఫిలిమ్ నగర్లో వాడీవేడీ చర్చ సాగుతూనే వుంది.
తాజాగా ఫ్యాన్స్ మీట్‌లో రజనీకాంత్ యువతు మద్యపానం, ధూమపానం వద్దే వద్దంటూ హితవు పలికారు. ఈ నేపథ్యంలో గతంలో సూపర్ స్టార్ రజనీకాంత్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో మద్యం మత్తులో తగాదాకు దిగి అరెస్టయిన వార్తకు సంబంధించిన తమిళ పేపర్ క్లిప్పింగ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. అందులో గత 1979వ సంవత్సరం, జూన్ 20వ తేదీ రజనీకాంత్ హైదరాబాద్ వెళ్లారు. ఆ రోజు రాత్రి 11 గంటల ప్రాంతంలో చెన్నైకి చేరుకునేందుకు ఎయిర్ పోర్టు వెళ్ళిన రజనీకాంత్ ఫూటుగా మద్యం సేవించారు.
మద్యం మత్తులో భారతీయులను ఆయన శునకాలంటూ దూషించినట్లు సదరు వార్తా పత్రిక ప్రచురించింది. ఆ సమయంలో రజనీకాంత్ తనతో వచ్చిన స్నేహితుడితో గొడవకు కూడా దిగారని.. ఎయిర్ పోర్టు అధికారులు వారి గొడవను అడ్డుకున్నట్లు తమిళ పత్రిక వెల్లడించింది. అంతటితో ఆగకుండా రజనీకాంత్‌ను అక్కడ నుంచి అద్దాల గదికి ఎయిర్ పోర్టు అధికారులు తీసుకెళ్లారు.
మద్యం మత్తులో ఏమాత్రం తగ్గని రజనీకాంత్.. అద్దాలను పగులకొట్టారని.. ఇక చేసేది లేక పోలీసులకు ఎయిర్ పోర్టు అధికారులు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన హైదరాబాద్ పోలీసులు రజనీకాంత్‌ను అరెస్ట్ చేసి.. విమాన టిక్కెట్లను రద్దు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వార్తలు జూన్ 21వ తేదీ (1979) పత్రికల్లో ప్రచురితమైంది. దీనికి సంబంధించిన పేపర్ కటింగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.