తండ్రి విజయకుమార్ ఇపుడు తన కుమార్తె వనితపై కేసు పెట్టాడు. స్థానిక మధురవాయిల్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కోలీవుడ్ నాట హాట్ టాపిక్‌గా మారింది. నిజానికి కొన్నాళ్ళుగా వనిత, విజయ్ కుమార్ కుటుంబాల మధ్య గొడవలు జరుగుతుండగా, బుధవారం ఇది మరోసారి బహిర్గతైమంది.
ఈ వివరాలను పరిశీలిస్తే, విజయ్ కుమార్‌కు అలపాక్కమ్‌లోని అష్టలక్ష్మీ నగర్ 11వ వీధిలో ఓ ఇల్లు ఉంది. ఈ ఇంటిని సినిమా, టీవీ సీరియల్స్ షూటింగ్‌లకు అద్దెకు ఇస్తుంటారు. ఈ క్రమంలో తన కూతురు షూటింగ్ కోసం ఇల్లు అద్దెకి అడగడంతో ఇచ్చానని విజయ్ కుమార్ అన్నారు.
అయితే షూటింగ్ పూర్తైన తర్వాత కూడా విజయ్ కుమార్ కూతురు వనిత ఇల్లు ఖాళీ చేయకపోగా న్యాయవాదులు, రౌడీలతో బెదిరింపులకి దిగుతుందని స్పష్టంచేశారు. విజయ్ కుమార్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న మధురవాయిల్ పోలీసులు విచారణ చేస్తున్నారు.
అయితే ఇంట్లో తనకు భాగం ఉన్నందునే తాను ఇల్లు ఖాళీ చేయనని పోలీసులతో వాగ్వాదానికి దిగింది వనిత. అంతేకాదు మీడియాతోనూ దురుసుగా ప్రవర్తించి వారి కెమెరాలని నేలకేసి కొట్టింది. తండ్రి, కూతుళ్ల మధ్య జరుగుతున్న ఈ వివాదం ఎలా ముగుస్తుందో చూడాలి.