ప్రముఖ తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వర రావు వర్ధంతి నేడు. సెప్టెంబర్ 20, 1923లో జన్మించిన ఆయన జనవరి 20, 2014లో కన్నుమూశారు. 1940లో ధర్మపత్ని ద్వారా తెలుగు సినీ రంగానికి పరిచయమైన అక్కినేని నాగేశ్వర రావు.. పూర్తిస్థాయి కథానాయకుడిగా శ్రీ సీతారామ జననంలో కనిపించారు.
భారతీయ సినిరంగంలో చేసిన కృషికి దేశంలో పౌరులకిచ్చే రెండవ పెద్ద పురస్కారమైన పద్మ విభూషణ్‌తో పాటు భారత సినీరంగంలో జీవిత సాఫల్య పురస్కారమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు పొందారు. అక్కినేని నాగేశ్వర రావు నటించిన మాయాబజార్, నమ్మిన బంటు, శ్రీకృష్ణార్జున యుద్ధం, భూకైలాష్, రోజులు మారాయి, మిస్సమ్మ, చక్రపాణి, ప్రేమించి చూడు, లైలామజ్ను, అనార్కలి, బాటసారి, ప్రేమనగర్, ప్రేమాభిషేకం, మేఘసందేశం వంటి సినిమాల్లో తెలుగు చిత్ర రంగంలో అద్భుతమైన నటుడిగా పేరు పొందారు.
సోషల్ మీడియాలో అక్కినేనికి సంబంధించిన పాటలు, సినిమాలు చక్కర్లు కొడుతున్నాయి. ఫోటోలు విపరీతంగా షేర్ అవుతున్నాయి. ట్విట్టర్‌లో #ANRLivesOn హ్యాష్‌ట్యాగ్ వచ్చేసింది. ఈ హ్యాష్ ట్యాగ్‌లో అక్కినేని నాగేశ్వర రావు తనయుడు, టాలీవుడ్ మన్మథుడు నాగార్జున ట్వీట్ చేశారు.