ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి థ్యాంక్స్: అల్లు అర్జున్

ఠాగూర్

మంగళవారం, 3 డిశెంబరు 2024 (08:50 IST)
'పుష్ప-2' చిత్రం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆ చిత్ర హీరో అల్లు అర్జున్ థ్యాంక్స్ చెప్పారు. ఈ మేరకు ఆయన తన ఎక్స్‌ వేదికగా ఓ ట్వీట్ చేశారు. ఈ నిర్ణయం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుగుదల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను తెలియజేస్తుందన్నారు. సినీ పరిశ్రమను ప్రోత్సహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు స్పెషల్ థ్యాంక్స్. ఫిల్మ్ ఇండస్ట్రీకి మద్దతుగా నిలుస్తోన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు సిన్సియర్ థ్యాంక్స్ అంటూ బన్నీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. 
 
కాగా, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు సుకుమార్ కాంబినేషన్‌లో రూపొందిన ఈ చిత్రం ఈ నెల 5 తేదీన విడుదలకానుంది. ఇప్పటికే చిత్రబృందం ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. దీనిలో భాగంగా సోమవారం రాత్రి హైదరాబాద్ నగరంలో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ముఖ్య అతిథిగా విచ్చేసి, చిత్ర బృందానికి అభినందనలు తెలిపారు. 
 
ఇక ఇప్పటికే 'పుష్ప 2' మూవీ టికెట్ బుకింగ్స్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. తెలంగాణ ప్రభుత్వం టికెట్ ధరల పెంపుతో పాటు బెనిఫిట్ షోలకు అనుమతి ఇచ్చింది. ఇప్పుడు ఏపీ సర్కార్ కూడా 'పుష్ప-2' టికెట్ ధరల పెంపునకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది.
 
అలాగే డిసెంబర్ 4న రాత్రి 9.30 గంటలకు బెనిఫిట్ షోతో పాటు అర్థరాత్రి ఒంటి గంట షో కూడా అనుమతి ఇచ్చింది. ఈ ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.800గా నిర్ణయించింది. దీనికి జీఎస్టీ అదనం. ఈ షో చూడాలంటే మల్టీఫ్లెక్స్, సింగిల్ స్క్రీన్ ఏదైనా సరే రూ.800 ప్లస్ జీఎసీ చెల్లించాల్సి ఉంటుంది. అలాగే, ఈ చిత్రం విడుదల రోజున మాత్రం ఆరు షోలను ప్రదర్శించుకునేందుకు ఏపీ సర్కారు అనుమతి ఇచ్చింది. 
 
అదేవిధంగా డిసెంబరు 5 నుంచి 17 వరకు గరిష్ఠంగా రూ.200 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. మల్టీఫ్లెక్సుల్లో రూ.200, సింగిల్ స్క్రీన్లలో లోయర్ క్లాసుకు రూ.100 (జీఎస్టితో కలిపి), అప్పర్ క్లాసుకు రూ.150 (జీఎస్టీతో కలిపి) వరకు పెంచుకోవచ్చంది. అలాగే డిసెంబర్ 5 నుంచి 17 వరకు ఐదు షోలకు అనుమతి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు