అపుడు హనుమాన్.. ఇపుడు రెహ్మాన్.. విద్వాంసులను కట్టిపడేసిన సంగీత మేధావి
శుక్రవారం, 6 జనవరి 2017 (11:15 IST)
పురాణాలను ఓసారి తిరగేస్తే... 'హనుమంతుడు సంగీతంలో దిట్ట. ఈ అంజనీపుత్రుడు నారదుడు, తుంబురుడు వంటి వారినే ఆశ్చర్యచకితుల్ని చేశాడు. ఇపుడు హనుమంతుడి తరహాలోనే సంగీత విద్వాంసులను, శ్రోతలను కట్టిపడేస్తున్న సంగీత దర్శకుడు ఏ.ఆర్.రెహ్మాన్. సంగీత ప్రపంచంలో సంచలనం.. వైవిధ్యమైన స్వర రచనల సంకలనాలకు ఆయన పెట్టింది పేరు.
సంగీత దర్శకుడైన అనతికాలంలోనే భారత అత్యున్నత పురస్కారాల్లో ఒకటైన 'పద్మశ్రీ' గౌరవాన్ని పొంది సంగీతాభిమానులతో 'జయహో' అనిపించుకున్నారు. మణిరత్నం 'రోజా' చిత్రంలోని చిన్నిచిన్ని ఆశ పాట నుంచి 'స్లమ్ డాగ్ మిలియనీర్' చిత్రంతో ఆస్కార్ అవార్డులను సొంతం చేసుకున్న సంగీత దిగ్గజం. అలాంటి సంగీత విద్వాంసుడు శుక్రవారం తన 50వ పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్నారు.
ఏ.ఆర్.రెహమాన్ 1967లో చెన్నైలో జన్మించారు. ఆయన తండ్రి ఆర్.కె.శేఖర్ ఫిల్మ్-స్కోర్ కంపోజర్. రెహమాన్ చిన్నతనంలో తండ్రి స్టూడియోలో కీబోర్డుతో ఆడుకునే వారు. ఆయన 9 ఏళ్ల వయసులో తండ్రి మృతి చెందారు. తర్వాత ఆ సంగీత వాయిద్యాలను అద్దెకిచ్చి వచ్చిన డబ్బుతో జీవితం సాగించారు. గిటార్, హార్మోనియం, పియానో, కీబోర్డు వాయించడం నేర్చుకున్నారు.
ప్రముఖ సంగీత దర్శకులు ఎం.ఎస్. విశ్వనాథన్, ఇళయరాజా, రమేశ్ నాయుడు, రాజ్- కోఠి దగ్గర పనిచేశారు. పాశ్చాత్య సంగీతంలో డిప్లొమా పూర్తి చేశారు. రెహమాన్ అసలు పేరు ఆర్.ఎస్.దిలీప్‌కుమార్. కుటుంబ సభ్యులు హిందూ మతం నుంచి ఇస్లాంకు మారిపోవడంతో ఎ.ఆర్.రెహమాన్‌గా తన పేరును మార్చుకున్నారు.
తొలుత రెహమాన్ డాక్యుమెంట్స్, వాణిజ్య ప్రకటనలకు పనిచేశారు. ఇలా ఆయన అందించిన పలు జింగిల్స్ బాగా పాపులర్ అయ్యాయి. 1992లో దర్శకుడు మణిరత్నంను కలిశారు. ఆయన దర్శకత్వం వహించిన 'రోజా' చిత్రానికి స్వరాలు సమకూర్చారు. ఈ చిత్రంలోని 'చిన్ని చిన్ని ఆశ' అనే పాట బాగా హిట్ అయ్యింది. ఈ ఒక్క పాటతో దేశంలోని సంగీతాభిమానులందర్నీ తనవైపు తిప్పుకొన్న ఘనత రెహమాన్‌ది.
తర్వాత 'జెంటిల్‌మెన్'లోని 'మావేలే మావేలే', 'ముద్దుబిడ్డ'లోని 'పదరా సరదాగా పోదాం పదరా', 'ప్రేమికుడు'లోని 'ఓ చెలియా నా ప్రియసఖియా', 'ముత్తు'లోని 'తిల్లానా తిల్లానా'.. ఈ పాటలతో అటు యువతను, ఇటు నడి వయసు వాళ్లకి మరీ దగ్గరైపోయాడు రెహమాన్. భాషతో సంబంధం లేకుండా చిత్రాలకు స్వరాలు సమకూర్చారు. ఇటీవల విడుదలైన '24', 'మొహంజోదారో' తదితర చిత్రాలకు స్వరాలు సమకూర్చిన రెహమాన్ ప్రస్తుతం '2.0', 'ఓకే జాను', 'డ్యుయట్' తదితర చిత్రాలకు పనిచేస్తున్నారు. సంగీతానికి భాషాభేదం లేదని నిరూపించి సరికొత్త మధురిమలను, యువతలో ఓ క్రేజ్‌ను రెహమాన్ సృష్టించగలిగారు.