చైనాలో 7వేలకు పైగా స్క్రీన్లపై బాహుబలి-2: దంగల్‌ రికార్డ్ బ్రేక్.. కానీ?

గురువారం, 3 మే 2018 (11:48 IST)
ప్రపంచ సినీ ప్రేక్షకులను టాలీవుడ్ వైపు తిరిగి చూసేలా చేసిన బాహుబలి-2 సినిమా వసూళ్ల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో అత్యధిక వసూళ్లు సాధించిన బాహుబలి-2.. త్వరలోనే చైనాలో రిలీజ్ కానుంది. ఇప్పటికే బాలీవుడ్ హీరో అమీర్ ఖాన్ నటించిన దంగల్ సినిమా చైనాలో భారీ వసూళ్లను సాధించింది. 
 
ఇదే తరహాలో బాహుబలి-2 కూడా అక్కడి ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా ఓవర్సీస్‌లో కొత్త రికార్డులను సృష్టించిన బాహుబలి-2 ఈ శుక్రవారం చైనాలో రిలీజ్ కానుంది. చైనాలోని ఐమాక్స్‌ స్క్రీన్స్‌ మీద రిలీజ్‌ అవుతున్న తొలి భారతీయ సినిమాగా మరో రికార్డ్‌ను బాహుబలి-2 తన ఖాతాలో వేసుకుంది. ఇంకా బాహుబలి-2 చైనాలో 7వేలకు పైగా స్క్రీన్లపై విడుదల కానుంది.
 
అమీర్ ఖాన్ దంగల్‌ సినిమా 7000 వేల స్క్రీన్స్‌‌పై రిలీజ్ అయితే.. బాహుబలి అంతకు మించి భారీ స్థాయిలో విడుదలవుతోంది. దీంతో దంగల్‌ రికార్డ్‌ను చెరిపేసిన బాహుబలి 2, 8వేల స్క్రీన్లపై విడుదలైన భజరంగీ బాయ్‌జాన్‌ రికార్డ్‌ను మాత్రం అధిగమించలేకపోయింది. కాగా చైనాలో విడుదలైన బాహుబలి తొలి పార్ట్ ఆ దేశ ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మరి బాహుబలి-2 చైనా ప్రేక్షకులను ఏమేరకు ఆకట్టుకుంటుందో.. కలెక్షన్లను ఎలా రాబడుతుందో వేచి చూడాల్సిందే. 

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు