ఇప్పుడు బాహుబలి మేనియా నడుస్తోంది. ఎల్లుండి ఏప్రిల్ 28న విడుదల కాబోతున్న బాహుబలి చిత్రం కోసం చాలామంది మూకుమ్మడి సెలవలు పెట్టేస్తున్నారు. మరోవైపు బాహుబలి టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ఆన్ లైన్లో ఎగబడుతున్నారు. దీనితో ఆయా సినీ థియేటర్ల సైట్లు అండర్ మెయిన్‌టెనెన్స్ అని సైట్లో పెట్టేసుకుంటున్నాయి. చెన్నై ఎస్పీఐ సినిమాస్ సైట్ ప్రస్తుతం ఇలాగే దర్శనమిస్తోంది. అక్కడ ఓ ఫోన్ నెంబరు జోడించారు కానీ అది కూడా కంటిన్యూగా ఎంగేజ్ సౌండ్ వస్తోంది.
ఆన్ లైన్ బుకింగ్ లేకపోవడంతో ప్రేక్షకుల్ని కొల్లగొట్టేందుకు బ్లాక్ మార్కెట్ జడలు విప్పింది. తిరుపతిలో బాహుబలి టిక్కెట్ రూ. 3000లు పలుకుతోంది. ఆన్ లైన్ ద్వారా టిక్కెట్లను విక్రయించాలన్న ఆదేశాలు ఉన్నా తిరుపతిలో మాత్రం ఇష్టానుసారం టిక్కెట్లను అమ్మేస్తున్నారు. ఎల్లుండి సినిమా విడుదల కానుండటంతో ప్రభాస్ అభిమానులు ఎంత డబ్బులు ఖర్చు పెట్టయినా కొనేందుకు సిద్ధమైపోయారు. దీంతో ఒక్కో టిక్కెట్‌ను 3వేల రూపాయలకు విక్రయించేస్తున్నారు.