టాలీవుడ్ అగ్ర నటుడు బాలకృష్ణ. గత సంక్రాంతికి "గౌతమీపుత్ర శాతకర్ణి" చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్. ఇపుడు ఈ కాంబినేషన్‌లో మరో చిత్రం రానుంది. నిజానికి ఈ జంట తొలిసారి ‘చెన్నకేశవరెడ్డి’ చిత్రంలో కనిపించారు. ఆ తర్వాత ‘గౌతమిపుత్ర శాతకర్ణి’లోనూ ఈ జంట కనువిందు చేసింది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బాలయ్య, శ్రియ ఆడిపాడబోతున్నారు.
బాలకృష్ణ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతున్న చిత్రం ముగ్గురు నాయికలకు చోటుంది. ముస్కాన్‌ని ఇప్పటికే ఓ నాయికగా ఎంచుకొన్నారు. ఇప్పుడు శ్రియకు కూడా చోటు దక్కింది. 'గౌతమీపుత్ర శాతకర్ణి' చిత్రం సమయంలో శ్రియకు బాలయ్య ఇచ్చిన మాట ప్రకారం.. ఈ చిత్రంలో కూడా ఆమెకు ఛాన్స్ కల్పించారు. కాగా, పూరీ చిత్రంలో సన్నీలియోని ఓ ప్రత్యేక గీతంలో కనిపించబోతోంది. మరో కథానాయికని ఎంపిక చేయాల్సివుంది.
ప్రస్తుతం హైదరాబాద్ శివార్లలో ఈ చిత్రం కోసం రూ.1.5 కోట్ల ఖర్చుతో ఓ భారీ సెట్ తీర్చిదిద్దారు. అక్కడే సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. ఈనెల 10 నుంచి బాలకృష్ణ షూటింగ్‌లో పాల్గొంటారు. విదేశాల్లో కొంతమేర చిత్రీకరణ సాగనుంది. ఆ షెడ్యూల్‌లో శ్రియ సెట్లో అడుగుపెట్టబోతోంది. అనూప్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రాన్ని నిర్మాత ఆనంద ప్రసాద్ భవ్య క్రియేషన్స్ సంస్థపై తెరకెక్కిస్తున్నారు.