హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో టాలీవుడ్ హీరో రవితేజ సోదరుడు భరత్ రాజు దుర్మరణం పాలుకాగా, అతన్ని చివరిసారి చూసేందుకు సైతం హీరో రవితేజ, భరత్ తల్లి రాజ్యలక్ష్మిలు రాలేదు. అతివేగంగా కారు నడుపుతూ రోడ్డు పక్కన ఆగివున్న లారీని ఢీకొట్టడంతో ఆయన చనిపోయారు.
అలాగే, భరత్ బాబాయి మూర్తి రాజు వృద్దాప్యం కారణంగా భరత్ అంత్యక్రియలకు దూరంగా ఉన్నారు. దీంతో రవితేజ మూడో సోదరుడు రఘు మాత్రమే భరత్ అంత్యక్రియలకు హాజరై, అతడి పర్యవేక్షణలోనే భరత్ అంత్యక్రియలు మహా ప్రస్థానంలో పూర్తిచేశారు. కొద్దిమంది మిత్రులు, పరిచయస్తులు మాత్రమే జూబ్లీహిల్స్ మహా ప్రస్థానానికి వచ్చి అంత్యక్రియలకు హాజరయ్యారు. భరత్ భౌతికకాయానికి సీనినటులు రాజశేఖర్, జీవిత, అలీ, ఉత్తేజ్, రఘుబాబు తదితరులు నివాళులర్పించిన వారిలో వున్నారు.
అయితే, కుటుంబ సభ్యులెవరూ చివరి చూపు కూడా చూడకపోవడంతో.. తలకొరివి పెట్టడానికి కూడా ఎవరూ ముందుకు రాకపోవడంతో ఓ జూనియర్ ఆర్టిస్ట్‌తో కార్యక్రమాలు చేయించారు. ఇందుకోసం అతడికి రూ.1500 రెమ్యునరేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది. పిల్లల స్కూలు ఫీజు కట్టడానికి డబ్బులు లేక ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నానని అక్కడున్నవారితో ఆర్టిస్ట్ చెప్పడంతో ఈ విషయం బయటకు పొక్కింది.
కాగా, గతంలో చెడు వ్యసనాలకు బానిసైన భరత్.. కుటుంబ సభ్యుల మాటలను పెడచెవిన పెట్టడం వల్లే.. అందరూ ఉండికూడా భరత్‌కు ఇలాంటి పరిస్థితి వచ్చిందని ప్రతి ఒక్కరూ చర్చించుకోవడం వినిపించింది. ముఖ్యంగా.. కన్నతల్లి కూడా భరత్‌ను చివరిసారి చూసేందుకు రాకపోవడం గమనార్హం.
కాగా, భరత్ అంత్యక్రియలకు హాజరుకాక పోవడంతో రవితేజ ఓ ప్రకటనలో స్పందించారు. సోదరుడి మరణాన్ని తట్టుకోలేక.. 40 ఏళ్ల పాటు కలసిమెలసి ఉన్న తమ్ముడిని నిర్జీవంగా చూడలేకనే తాను దహనక్రియలకు వెళ్లలేదని వివరించారు. తల్లి రాజ్యలక్ష్మి కూడా ఇవే కారణాలతో అంత్యక్రియలకు వెళ్లలేదని తెలిపారు.