బిగ్ బాస్: సునయనతో కన్నీళ్ళు పెట్టించిన కాల్ సెంటర్ టాస్క్..?

గురువారం, 16 ఆగస్టు 2018 (22:13 IST)
బిగ్ బాస్ హౌజ్ పోనుపోనూ మరింత కఠినంగా మారుతుందనడానికి సూచనలు కనిపిస్తున్నాయి. హౌజ్ లో బాబు గోగినేని ఉన్నన్నాళ్లు కాస్త కఠినమైన టాస్క్‌లు ఇవ్వడానికి బిగ్ బాస్ వెనకాడారు. ఆయన ఎటువంటి కామెంట్లు చేస్తారో అనే టెన్షన్ బాస్‌లో ఉండేది. ఇప్పుడు అదిలేదు.‌ మంగళవారం నాటి ఎపిసోడ్‌లో దీప్తి సునయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కాల్ సెంటర్ పేరుతో ఓ టాస్క్ ఇచ్చారు. కొందరు కాల్ సెంటర్ ఉద్యోగులుగానూ, కొందరు కాల్ సెంటర్‌కు కాల్ చేసే పబ్లిక్‌గానూ ఉండాలి.‌ 
 
పబ్లిక్ ఫోన్ చేసి అడిగే ప్రశ్నలకు కాల్ సెంటర్ ఉద్యోగులు ఓపిగ్గా సమాధానం ఇవ్వాలి. ఎవరు ముందుగా ఫోన్ పెట్టేస్తే ఆ టీమ్‌కు పాయింటు రాదు. ఎదుటివారికి పాయింట్ లభిస్తుంది. టాస్క్‌లో ముందుగా గీత ఫోన్ చేసి కౌశల్‌తో మాట్లాడారు. కొంతసేపటికి గీత ఫోన్ పెట్టేశారు. రెండో కాల్ తనిష్ శ్యామలకు చేశారు. ఎంత ఇరిటేట్ చేయడానికి ప్రయత్నించినా ఫలితం లేదు. దీంతో తనిష్ ఫోన్ పెట్టేశారు. మూడో కాల్ రోల్ చేశారు. సామ్రాట్‌కి చేసి కౌశలా అని అడిగారు. దీంతో కాదు తాను సామ్రాట్ అని చెప్పాడు సామ్రాట్. రోల్ టఫీమని ఫోన్ రిసీవర్ పక్కన పెట్టారు. ఫోన్ కట్ చేశారని భావించి సామ్రాట్ కాల్ కట్ చేశారు. దీంతో సామ్రాట్ ముందుగా కాల్ కట్ చేసినట్లయింది.
 
నాలుగో కాల్‌గా సునయన… కౌశల్‌కు చేశారు. సునయన ఎంత ఇరిటేట్ చేసినా కౌశల్ నవ్వుతూనే మాట్లాడారు. ఏదైనా కథ చెప్పమని సునయన అడిగారు. దానికి కౌశల్ ఏదో ఊహించి ఏదో చెబుతూనే ఉన్నారు. రాత్రి 11 గంటలకు మొదలైన ఈ కాల్ రాత్రి 2.30 దాకా కొనసాగుతూనే ఉంది. కౌశల్ విసుగు లేకుండా మాట్లాడుతూనే ఉన్నారు. సునయనకు ఓపిక నశించినా కాల్ వదల్లేదు. ఆ బాధలో ఆమె కళ్ల నుంచి కన్నీళ్ళు ధారగా వస్తూనే ఉన్నాయి. మధ్యలో రిసీవర్ పక్కన పెట్టి వాష్ రూంకి వెళ్లి వచ్చి మళ్లీ కాల్ కొనసాగించారు. ‌ఈ టాస్క్‌ను ఎంత సీరియస్‌గా తీసుకున్నారంటే… కౌశల్‌కు మూత్రవిసర్జన అవసరం వచ్చినా అక్కడ నుంచి లేవకుండా…. చుట్టూ తెరకట్టి ఆ పని పూర్తి చేశారు.
 
ఇదిలావుండగా తనిష్, సునయన పగటి పూట నిద్రపోతుండటంతో బిగ్ బాస్ సీరియస్ అయ్యారు. ఇద్దరికీ శిక్ష విధించారు. విసనకర్ర తీసుకుని ఎవరికో ఒకరికి విసురుతూనే ఉండాలని చెప్పారు. రాత్రి కూడా నిద్రపోకుండా ఈ పని చేయాలని ఆదేశించారు. ఇవన్నీ చూస్తుంటే మరిన్ని కఠిన పరీక్షలు ఇంటి సభ్యులకు తప్పేలా లేవు. కాల్ సెంటర్ టాస్క్ పూర్తయితే సభ్యుల మధ్య విభేదాలు మరింత తీవ్రమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ పరిణామాలు ఎలా వుంటాయోనని గీత ముందుగానే ఆందోళన వ్యక్తం చేశారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు