బిగ్ బాస్ షో నుంచి జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. ఈ విషయాన్ని ఎన్టీఆరే స్వయం ప్రస్తావించారు. జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘బిగ్‌బాస్’ రియాలిటీ షో ఆదివారం రాత్రి అత్యంత ఆసక్తికరంగా సాగింది. ఈ షోలో ఎలిమినేషన్ తప్పనిసరి అంటూ ఎన్టీఆర్ ప్రకటించడంతో.. ఎలిమినేషన్ నామినేషన్‌లో అత్యధికంగా 7 ఓట్లు వచ్చిన జ్యోతి ‘బిగ్‌బాస్’ నుంచి తొలగిపోయారు. ప్రేక్షకుల నుంచి కూడా ఆమెకు మద్దతు రాకపోవడంతో బిగ్‌బాస్ నిర్ణయం మేరకు ఫస్ట్ ఎలిమినేటర్‌గా ఎన్టీఆర్ ఆమె పేరును ప్రకటించారు.
తొలివారం ఎలిమినేషన్‌కు ఐదుగురు సభ్యులు కత్తి కార్తీక, మహేష్ కత్తి, మధుప్రియ, హరితేజ, జ్యోతి నామినేట్ అవ్వగా.. శనివారం రాత్రి మధుప్రియ, హరితేజ, కత్తికార్తీకలు సేఫ్‌జోన్‌కు వెళ్లారు. ఇక మిగిలిన ఇద్దరిలో ఆదివారం రాత్రి మహేష్ కత్తి సేఫ్‌జోన్‌కు వెళ్లగా.. జ్యోతి ఎలిమినేట్ అయ్యారు. శనివారం రాత్రి మహేష్ కత్తి కన్ఫర్మ్ అన్నట్టు ఎన్టీఆర్ ప్రకటించినప్పుడు హౌస్‌మేట్స్ కాస్తంత భావోద్వేగానికి గురయ్యారు. కానీ జ్యోతిని ఎలిమినేట్ చేస్తున్నట్లు ప్రకటించినప్పుడు హోస్ మేట్స్ ఏమాత్రం స్పందించలేదు.
ఇదిలా ఉంటే... బిగ్ బాస్ షో వివాదానికి దారితీసింది. ఈ షో మొత్తం 70 రోజుల ప్రక్రియ కాగా ఇందులో మొత్తం 14 మంది పాల్గొన్నారు. ఇంతవరకు బాగుంది కాని ఈ షోలో కార్యక్రమాలలో భాగంగా హోమగుండం వద్ద బ్రష్ చేసుకుంటూ చలి మంటలు కాచుకుంటున్నట్లుగా దృశ్యాలు ఉన్నాయని, అందులో ఆజ్యం పోస్తుండటం వంటి అభ్యంతరకరమైన సన్నివేశాలు వివాదానికి దారితీసాయి. దీంతో బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేసాయి. ఈ షో నిర్వాహకులు వెంటనే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ రియాలిటీ షోలో హైందవ సంస్కృతిని కించపరిచేలా సన్నివేశాలు ఉన్నాయని బ్రాహ్మణ సంఘాలు ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.