అక్టోబరు రెండో తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయం వెల్లడించారు. సైరా గెటప్‌లో ఉన్న తనను చూసి తన తల్లి అంజనాదేవి ఎంతో సంతోషపడిందన్నారు. శంకర్ బాబూ, నిన్ను చూస్తుంటే ఎవరో మహానుభావుడ్ని చూసినట్టుందిరా అంటూ ముగ్ధురాలైందని చిరు వివరించారు.
పైగా, హైదరాబాద్‌లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో మామూలు థియేటర్‌లో సాధారణ ప్రేక్షకుల మధ్యన కూర్చుని సైరా సినిమా చూస్తానని చెప్పిందని వెల్లడించారు. తామందరం మల్టీప్లెక్స్‌లో సైరా చూద్దామన్నా తన తల్లి ససేమిరా అంటోందని, అభిమానుల కోలాహలం మధ్యనే సినిమా చూడాలని కోరుకుంటోందని తెలిపారు.
ఆ తర్వాత సైరా నరిసింహా రెడ్డి కథపై చెలరేగిన వివాదం, ఉయ్యాలవాడ వంశీయుల ఆందోళన తదితర అంశాలపై చిరంజీవి స్పందిస్తూ, వాస్తవానికి వాళ్లు చాలా అమాయకులని, ఎవరో వాళ్లను తమపై ఉసిగొల్పారని చిరంజీవి ఆరోపించారు. వాళ్లది సాధారణ ఆర్థిక స్థితి అని, వాళ్లు సులభంగా ఉచ్చులో పడిపోయారని విచారం వ్యక్తం చేశారు.
వారికి కానీ, వాళ్ల గ్రామానికి కానీ ఏదైనా మేలు చేద్దామని రాంచరణ్ భావించాడని, కానీ వాళ్లు 'మేం పాతిక కుటుంబాలు ఉన్నాం, కుటుంబానికి రెండు కోట్లు ఇవ్వాలి' అని డిమాండ్ చేశారని చిరంజీవి వెల్లడించారు. ఆ విధంగా అయితే రూ.50 కోట్లు తాము ఎక్కడి నుంచి తెచ్చివ్వగలమని ఆవేదన వ్యక్తం చేశారు. 100 సంవత్సరాల తర్వాత ఎవరి కథ అయినా చరిత్ర కిందికే వస్తుందని, దానిపై వారసులకు హక్కులు ఉండవని, ఈ విషయం కోర్టు కూడా చెప్పిందని చిరంజీవి గుర్తుచేశారు.