మహాసభల్లో భాగంగా సంగీత విభావరి నిర్వహించారు. ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్దలందరూ తరలివచ్చారు. తారలందరినీ తెలంగాణ ప్రభుత్వం తరుపున ఈ సభలో సన్మానించారు. సన్మానాన్ని అందుకున్న అనంతరం మెగాస్టార్ చిరంజీవి ప్రసగించారు. తెలుగుని మాతృభాష అని ఎందుకు అంటారో ఆయన తెలిపారు. మన ఆలోచనగానీ, మన కలగానీ ఏ భాషలో అయితే ఉంటుందో అదే మాతృభాష అని చిరంజీవి అన్నారు.
అలాగే, మహా సభలను ఘనంగా నిర్వహించిన కేటీఆర్‌ను చిరంజీవి అభినందిస్తూ, తమ మధ్య జరిగిన ఓ చిన్నపాటి సంఘటనను వివరించారు. "కేటీఆర్‌గారూ ఈ మహాసభలకు పిలిచేందుకు మా ఇంటికి వచ్చారు. ఆ సమయంలో వివిధ రంగాల్లో ఆయన పనితీరును అభినందిస్తూ పలు అవార్డులు వచ్చాయి. దీంతో కేటీఆర్‌ను అభివనందిస్తూ ఇంగ్లీష్‌లో విష్ చేశాను.
అయితే వెంటనే 'అన్నా.. మనం తెలుగు వాళ్లం. స్వచ్ఛమైన తెలుగు కార్యక్రమానికి పిలవడానికి వచ్చిన ఈ సందర్భంలో తెలుగులో మాట్లాడుకుంటే బావుంటుంది కదా..' అని అనగానే నాకు ఒక్కసారిగా చివుక్కుమనిపించింది. నిజమే కదా..! ఇద్దరు తెలుగు వాళ్లు ఎదురుపడినప్పుడు చక్కటి తెలుగు మాట్లాడకుండా.. ఆంగ్ల భాషని ఎందుకు వాడుతున్నాం అని అనిపించింది. వెంటనే ఆయనకి క్షమాపణ చెప్పేశాను.
'లేదు అన్నా.. జస్ట్ జోకింగ్' అని ఆయన అన్నప్పటికీ.. తమాషాగా అన్నా కూడా నాలో వెంటనే ఆలోచనని కలిగించింది. ఇది కరెక్టే కదా అని. ఎందుకు అంత భేషజాలకు పోతున్నాం. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు చాలా మంది ఆఫీసర్స్‌ని చూశాను. ఇద్దరు ఆఫీసర్స్ హిందీలోనే మాట్లాడుకుంటారు. అలాగే ఇద్దరు తమిళులు ఒకచోట చేరితే వారి మాతృభాషలోనే మాట్లాడుకుంటారు. వారి భాషలో మాట్లాడుకోవడాన్ని ప్రేమిస్తారు.
మరి మన తెలుగు వాళ్లు మాత్రమే.. ఇలా ఆంగ్లంలో మాట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకిలా జరుగుతుంది. తెలుగుని బ్రతికించలేమా? ఇకనైనా.. మనం తెలుగుని ప్రేమిద్దాం. తెలుగుని మనం పోషిద్దాం.. తెలుగుని ముందుకు తీసుకువెళదాం. భావితరాలకు ఆస్థిగా మన తెలుగుని అందించాల్సిన బాధ్యత మనకుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను' అంటూ చిరంజీవి తన ప్రసంగాన్ని ముగించారు.