ఏపీలోని కడప జిల్లా కేంద్రంలో నాన్నమ్మ మందలింపు ఒకే ఇంట్లో నలుగురి ప్రాణాలు కోల్పోయేలా చేసింది. భార్యాభర్తల మధ్య చెలరేగిన మనస్పర్ధలే నాన్నమ్మ మందలింపునకు కారణం కాగా, చివరకు ఆమెతో పాటు, భార్యాభర్తలు, ఓ కుమారుడు ప్రాణాలు కోల్పోయారు. ఈ హృదయ విదారక ఘటన కడప నగరంలో తీవ్ర కలకలం రేపింది.
కడప జిల్లా కేంద్రంలోని శంకరాపురానికి చెందిన శ్రీరాములు (35), శిరీష (30) దంపతులు. వీరికి యేడాది వయసున్న రుత్విక్ అనే కుమారుడు ఉన్నాడు. వీరు శ్రీరాములు నానమ్మ అయిన సుబ్బమ్మతో కలిసి ఉంటున్నారు. అయితే, గత కొంతకాలంగా శ్రీరాములు, శిరీష మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో సుబ్బమ్మ వారిద్దరినీ నాన్నమ్మ మందలించారు.
నానమ్మ మందలించడంతో మనస్తాపానికి గురైన శ్రీరాములు, తన భార్య శిరీష, కుమారుడు రుత్విక్‌ను తీసుకుని ఇంట్లో నుంచి వెళ్లిపోయారు. మనవడు, మనవరాలు, మునిమనవడు కనిపించకపోవడంతో తీవ్ర ఆందోళనకు గురైన సుబ్బమ్మ, ఆ దిగులుతో గుండెపోటుకు గురై ఇంట్లోనే ప్రాణాలు విడిచారు.
మరోవైపు, ఇంటి నుంచి వెళ్లిన శ్రీరాములు, శిరీష దంపతులు తమ కుమారుడితో కలిసి కడప రైల్వే స్టేషన్‌కు చేరుకున్నారు. అర్థరాత్రి సుమారు 11 గంటల సమయంలో మూడో నంబర్ ట్రాక్‌పై వెళ్తున్న గూడ్స్ రైలు కిందపడి ముగ్గురూ ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటనలో ముగ్గురూ అక్కడికక్కడే మృతి చెందారు. ఒకే కుటుంబంలో నలుగురు మరణించడంతో శంకరాపురంలో విషాదఛాయలు అలుముకున్నాయి.