మెగాస్టార్ చిరంజీవికి హైదరాబాద్ సివిల్ కోర్టులో ఊరట లభించింది. తన అనుమతి లేకుండా తన పేరు, ఫోటోలను వినియోగించరాదంటూ చిరంజీవి చేసుకున్న విజ్ఞప్తి పట్ల సానుకూలంగా తీర్పునిచ్చింది. వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగంపై తాత్కాలిక నిషేధం విధించింది. వ్యక్తిత్వ హక్కుల పరిరక్షణ కోరుతూ గతంలో చిరంజీవి ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తీర్పును చిరంజీవికి అనుకూలంగా ఇచ్చింది.
ఈ మేరకు హైదరాబాద్ సివిల్ కోర్టు జడ్జి ఎస్.శశిధర్ రెడ్డి జారీ చేసిన ఆదేశాల్లో ఆన్‍లైన్ దుస్తుల సంస్థలు, డిజిటల్ మీడియా, యూట్యూబ్ చానెళ్లు సహా ఏ సంస్థ కూడా చిరంజీవి పేరు మెగాస్టార్, చిరు, వంటి బిరుదులు ఆయన ఫోటోలు, వాయిస్‌ను వ్యాపార ప్రకటనలో కోసం వినియోగించకూడదని పేర్కొన్నారు.
కాగా, కొంతకాలంగా పలు సంస్థలు తన అనుమతి లేకుండా తన గుర్తింపును వాడుకుంటూ వాణిజ్యపరంగా లబ్దిపొందుతున్నారంటూ చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు. దీనివల్ల తన ప్రతిష్టకు భంగం కలగడంతో పాటు ఆర్థికంగా నష్టంవాటిల్లుతోందని ఆయన న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు.