ఉపాసన తో మాట్లాడి చిత్రపురిలో మంచి ఆస్పత్రి నిర్మాణానికి సహకారం అందిస్తానని, ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసుకుని రావాలని చిరంజీవి చెప్పారు. సందర్భం ఉన్నప్పుడు చిత్రపురి కాలనీని సందర్శిస్తానని కూడా మెగాస్టార్ కమిటీ సభ్యులతో అన్నారు.
చిరంజీవి గారితో దాదాపు అర గంట పాటు చిత్రపురి కాలనీ సెక్రటరీ కాదంబరి కిరణ్, ప్రెసిడెంట్ వల్లభనేని అనిల్, వినోద్ బాలా, దీప్తి వాజ్ పేయి, అనిత నిమ్మగడ్డ, లలిత, రామకృష్ణ ప్రసాద్, అళహరి మాట్లాడారు. తమకు అండగా ఉండేందుకు ముందుకొచ్చిన మెగాస్టార్ చిరంజీవి గారికి చిత్రపురి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా కాదంబరి కిరణ్ మాట్లాడుతూ...తమ్ముళ్లు ఎలా ఉన్నారు అని పలకరించే మా అన్నయ్య చిరంజీవి గారిని ఇవాళ కలవడం జరిగింది. చిత్రపురి కొత్త కమిటీగా ఎన్నికయ్యాక అన్నయ్య చిరంజీవి గారిని కలవాలని అనుకున్నాం. ఇవాళ వారి ఆశీస్సులు తీసుకున్నాం. చిత్రపురి కాలనీలో మంచి ఆస్పత్రి నిర్మాణం జరగాలని మూడు నాలుగేళ్లుగా తిరుగుతున్నాను.
అప్పుడు ఎంతో ప్రయత్నించి వైద్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి గారిని చిత్రపురికి తీసుకొచ్చాము. మొన్న పవన్ కళ్యాణ్ గారిని కలిసినప్పుడు కూడా ఆయనకు ఆస్పత్రి గురించి చెప్పాం. ఆయన తన వంతు సహకారం ఖచ్చితంగా అందిస్తానని అన్నారు. ఇప్పుడు అదే విషయాన్ని మెగాస్టార్ చిరంజీవి గారికి చెప్పాం. ఉపాసన గారితో చిత్రపురిలో ఆస్పత్రి విషయం మాట్లాడతాను అన్నారు. చిరంజీవి గారికి కృతజ్ఞతలు చెబుతున్నాం. అన్నారు.
వల్లభనేని అనిల్ మాట్లాడుతూ...చిరంజీవి గారిని కలిసి చిత్రపురి కాలనీ వివరాలను తెలిపాం. ఆయన ప్రతి విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. కాలనీపై వస్తున్న అభియోగాలు, నిజానిజాలు ఆయనకు చెప్పాం. మేము చెప్పిన విషయాలతో చిరంజీవి గారు సంతృప్తి చెందారు. అందరికీ న్యాయం జరిగేలా కొత్త కమిటీ నిర్ణయాలు తీసుకోవాలని కోరారు. అలాగే కమిటీగా ఎన్నుకుని కాలనీ వాసులు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. గృహప్రవేశాల ప్రారంభానికి తాను అతిథిగా వస్తానని హామీ ఇచ్చారు. అన్నారు.
దీప్తి వాజ్ పేయ్ మాట్లాడుతూ...ఏ కాలనీకైనా గుడి, బడి, ఆస్పత్రి చాలా ముఖ్యం. చిత్ర పురి కాలనీలో గుడి అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే మంచి స్కూల్ ఉంది. ఆస్పత్రి నిర్మాణం కోసం చిరంజీవి గారు సహకారం అందిస్తామనడం సంతోషంగా ఉంది. అన్నారు.