రేపటి నుంచి యధావిధిగా షూటింగ్‌లు -వేత‌నాలు పెంపుపై దిల్‌రాజుతో క‌మిటీ

గురువారం, 23 జూన్ 2022 (19:03 IST)
C. Kalyan, Kolli Ramakrishna, Vallabhbhaneni Anil Kumar
తెలుగు చలనచిత్ర పరిశ్రమలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికులు గ‌త రెండు రోజులుగా సమ్మె చేస్తున్నారు. నిన్న‌నే తెలంగాణ మంత్రి త‌ల‌సాని జోక్యం చేసుకుని సినీ పెద్ద‌ల‌తో స‌మావేశం అయ్యారు. దాని ప‌ర్యావ‌సానంగా గురువారంనాడు హైద‌రాబాద్‌లోని తెలుగు సినిమా వాణిజ్య‌మండ‌లి (ఫిలింఛాంబ‌ర్ ఆఫ్ కామ‌ర్స్‌) కార్యాల‌యంలో నిర్మాత‌ల‌మండ‌లి అధ్య‌క్షుడు సి.క‌ళ్యాణ్‌, ఫిలింఛాంబ‌ర్ నూత‌న అధ్య‌క్షుడు కొల్లి రామకృష్ణతో పాటు ప‌లువురు సినీపెద్ద‌లు, ఫెడ‌రేష‌న్ అధ్య‌క్ష్య కార్య‌ద‌ర్శులు వ‌ల్ల‌భ‌నేని అనిల్ కుమార్‌, దొరై త‌దిత‌రులు స‌మావేశం అయ్యారు. 
 
వేత‌నాలు 45శాతం పెంపుద‌ల‌పై రేపు చ‌ర్చ‌
 
సుధీర్ఘ స‌మావేశం అనంత‌రం ప్ర‌ముఖ నిర్మాత సి. క‌ళ్యాణ్ మీడియా స‌మావేశంలో మాట్లాడారు. కార్మికులు కోరిన‌ట్లుగా 45 శాతం వేత‌నాల పెంపుద‌ల‌పై హామీ ఇవ్వ‌లేదు. అయితే ఎంత ఇవ్వాల‌నేది శుక్ర‌వారంనాడు దిల్‌రాజు ఆధ్వ‌ర్యంలో మ‌రోసారి చ‌ర్చించి అంద‌రికీ ఆమోద‌యోగ్య‌మైన వేత‌నాలు కార్మికుల‌కు అంద‌జేస్తామ‌నీ, కార్మికులుంటేనే సినిమాల షూటింగ్‌లు జ‌రుగుతాయ‌ని పేర్కొన్నారు.
 
 విధివిదానాలను  దిల్ రాజు చైర్మన్ గా క‌మిటీ
 
సి.క‌ళ్యాణ్ చ‌ర్చ‌లు సారాంశాన్ని తెలియ‌జేశారు.  వేతనాలు పెంచేందుకు నిర్మాతలు, షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సినీ కార్మికులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో రేపు (శుక్రవారం) జీతాల పెంపు విషయమే నిర్మాతలందరితో చర్చలు జరిపి విధివిధానాలను ప్రకటిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలపగా.. చర్చలు సఫలం అవడంతో రేపటి నుండి (శుక్రవారం) యథావిధిగా సినిమా షూటింగ్స్ జరుగుతాయని, పెరిగిన జీతాలు రేపటి నుండే అమలులోకి వస్తాయని  ఫిల్మ్ ఫెడరేషన్ పెద్దలు ప్రకటించారు.
 
అనంత‌రం ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ.. ‘‘మంత్రి తలసానిగారి చొరవతో జరిగిన సమావేశంలో అన్ని విషయాలు చర్చకు వచ్చాయి. వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమయ్యారు. రేపటి నుంచి సినిమా షూటింగ్స్ యథావిధిగా జరుగుతాయి. సినీ కార్మికులు షూటింగ్స్‌కు హాజరవుతారు. అన్ని సమస్యలను కోఆర్డినేషన్ కమిటీ ద్వారా పరిష్కారం చేసుకుంటామ‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా మీడియాకు ప్ర‌త్యేక ధ‌న్య‌వాదాలు తెలియ‌జేశారు. మీరులేనిదే ఈ స‌మ‌స్య‌ల ఇంత త్వ‌రగా కొలిక్కివ‌చ్చేదికాద‌ని పేర్కొన్నారు.

వెబ్దునియా పై చదవండి

సంబంధిత వార్తలు