వెనువెంటనే బంపర్ ఆఫర్ వచ్చింది. నాగభూషణంతో ఉన్న పరిచయంతో ఆయన్ను ముఖ్య పాత్రలో పెట్టుకుని, దాసరి ఓ కథ రెడీ చేశారు. అదే ‘తాత–మనవడు’. నిర్మాత రాఘవ. అప్పటికి నాగభూషణం సూపర్ స్టార్ కావడంతో భారీ పారితోషికం అడిగారు. ‘ఇప్పుడు కొంచెం.. రిలీజై 50 రోజులాడిన వెంటనే మిగతా పారితోషికం ఇస్తా’ అని రాఘవ చెప్పిన మాటలను నాగభూషణంకు చేరవేశారు దాసరి. ‘ఏమో.. 50 రోజులాడుతుందా’ అని నాగభూషణం అనడం, దాసరి బాధపడటం జరిగాయి. చివరకు ఎస్వీఆర్, రాజబాబు, సత్యనారాయణలతో ఆ సినిమా తీశారు. 350 రోజులాడిందా సినిమా. ఒక కమెడియన్‌ని హీరోగా పెట్టి సినిమా తీయడమే సంచలనం అయిన ఆరోజుల్లో ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి దిగ్గజ హీరోలకు తీసిపోకుండా డేరింగ్‌గా తీసిన తాత-మనవడు తెలుగు చిత్రసీమలో చిన్న సినిమాల మనుగడకు ప్రాణం పోసింది.