దర్శక దిగ్గజం దాసరి మృతి.. కన్నీరుమున్నీరవుతున్న తోలుకట్ట గ్రామ వాసులు.. ఎందుకు?

బుధవారం, 31 మే 2017 (09:06 IST)
అర్థ శతాబ్దం పాటు సినీ ప్రస్థానం సాగించిన బహుదూరపు బాటసారి దర్శకరత్న దాసరి నారాయణ రావు ఇక లేరు. ఏడడుగుల బంధంతో బ్రహ్మముడి వేసి ఒక్కటైన దాసరి జంట సినీ రంగంలో ఆది దంపతులుగా నిలిచారు. భార్య పద్మతో అనురాగ దాంపత్యం గడిపిన దాసరి, 2011లో ఆమె ఎడబాటుతో ఒంటరిగా మారారు. అప్పటినుంచే అనారోగ్య సమస్యలతో సతమతమైన దాసరి నారాయణరావు 75 ఏళ్ల వయసులో, నమ్మిన వారందరినీ ‘గాలివాన’లాంటి సంక్షోభంలో వదలి, మంగళవారం ఆకాశదేశానికి పయనమయ్యారు. దీంతో తెలుగు చిత్రపరిశ్రమ బోరున విలపిస్తోంది. వీరితో పాటు.. తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా, మొయినాబాద్‌ మండలం తోలుకట్ట గ్రామ వాసులు కూడా కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి కారణం ఈ గ్రామంతోనూ, ఈ గ్రామవాసులతోనూ దాసరికి ప్రత్యేక అనుబంధం ఉంది. 
 
ఈ గ్రామంలో దాసరికి ప్రత్యేక వ్యవసాయక్షేత్రం ఉంది. ఇందులో సేద తీరేందుకు అప్పుడప్పుడూ వచ్చేవారు. దాసరి కేంద్రమంత్రిగా ఉన్నపుడు ఈ గ్రామాన్ని బాగా అభివృద్ధి చేశారు. దాసరి.. తన భార్య పద్మ జీవించివుండగా, వారానికి ఒకటి రెండు సార్లు ఇక్కడికి వచ్చేవారని గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. పద్మ మృతి చెందడంతో ఆమె పేరున వ్యవసాయ క్షేంత్రంలో ప్రత్యేకంగా కొంత స్థలం కేటాయించి స్మారక చిహ్నంగా గార్డెన్‌ ఏర్పాటు చేశారు. 
 
అనంతరం ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలకు ఇక్కడకు వచ్చేవారు. తోలుకట్ట నుంచి చేవెళ్ల వెళ్లే రోడ్డు నిర్మించి.. అంతర్గత మురుగు కాలువల నిర్మాణం కోసం నిధులు కేటాయించారని వారు చెప్పారు. ఆయన మృతి వార్త తెలిసి దిగ్భ్రాంతికి గురయ్యారు. ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. దాసరి అంత్యక్రియలు ఇక్కడే జరుగనున్నాయి. ఇక్కడి ఆయన వ్యవసాయ క్షేత్రంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. 

వెబ్దునియా పై చదవండి