ఆస్తి కోసం కన్నతల్లిపై కొడుకు కత్తితో దాడి.. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ...

ఠాగూర్

మంగళవారం, 12 ఆగస్టు 2025 (12:57 IST)
ఏపీలోని ఏలూరు జిల్లా కొయ్యలగూడెంలో దారుణం జరిగింది. ఆస్తి కోసం కన్నతల్లిపై కత్తితో దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తల్లి మృతి చెందింది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, 
 
కొయ్యలగూడెంకు చెందిన జక్కు లక్ష్మీనరసమ్మ అనే మహిళకు పిల్లలు చిన్న వయసులో ఉండగానే భర్త చేనిపోయాడు. దీంతో ఆమె కొయ్యలగూడెం రహదారి పక్కన కూరగాయలు అమ్ముకుంటూ పిల్లలను పోషించుకుంటోంది. ఏడేళ్ల క్రితం కుమారుడు జక్కు శివాజీకి వివాహం కాగా, ఆ తర్వాత అతడు అత్తగారి ఊరైన ఎన్.ఎన్.డి పేటకు వెళ్లాడు. కుమార్తెకు కూడా వివాహం కావడంతో లక్ష్మీనరసమ్మ మాత్రం ఒంటరిగా జీవిస్తోంది. 
 
అయితే, గత కొంతకాలంగా ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వాలని తల్లిని కొడుకు వేధిస్తూ వచ్చాడు. బంధువుల ద్వారా కూడా తల్లిపై ఒత్తిడి తెచ్చారు. ఈ క్రమంలో కొన్ని రోజుల క్రితం తల్లీ కొడుకుల మధ్య వాగ్వాదం జరిగి రెండుసార్లు కర్రతో తల్లిని కొట్టి గాయపరిచాడు. ఈ క్రమంలో ఆస్తి అమ్మి డబ్బులు ఇవ్వడానికి లక్ష్మీ నరసమ్మ అంగీకరించకపోవడంతో ఆదివారం పట్టపగలే అందరూ చూస్తుండగాన ఆమెపై కత్తితో దాడిచేశాడు. 
 
ఈ దాడిలో ఆమె మెడ, తలతో పాటు శరీరంపై గాయాలు కావడంతో కుప్పకూలిపోయింది. వెంటనే స్థానికులు ఆమెను కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం ప్రాణాలు విడిచింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. తల్లి మృతికి కారణమైన శివాజీని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. 

వెబ్దునియా పై చదవండి